సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్యాంగోలిన్(అలుగు)ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలిసి పట్టుకున్నారు. వన్యప్రాణిని ప్రాణాలతో రక్షించారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్న ప్యాంగోలిన్కు చైనా తదితర విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది. దీని పొలుసులు(పై పొరలు) బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక మందుల తయారీల్లో ఉపయోగిస్తుంటారు. ఇది ఉంటే మంచి జరుగుతుందనే మూఢ నమ్మకం సైతం చాలా మందిలో ఉంది. ఈ వన్యప్రాణి దొరికితే భారీగా సంపాదించవచ్చనే అభిప్రాయంలో వేటగాళ్లు ఉంటారు. ఈ క్రమంలోనే ఎల్బీనగర్ పోలీసులకు వచ్చిన ఒక సమాచారంతో డెకాయి ఆపరేషన్ చేసి, ఈ స్మగ్లింగ్ రాకెట్ గుట్టును రట్టు చేశారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా శివాపురం మండలం అల్లిపూర్తండాకు చెందిన ఎస్లావత్ రూప్సింగ్ అలీపూర్ అటవీ ప్రాంతంలో పంగోలిన్‌ను వేటాది కరీంనగర్‌కు చెందిన నునావత్ మురళి, హుజురాబాద్‌కు చెందిన నీరటి సంపత్, కడ్తాల్, మైసిగండికి చెందిన రమావత్ రమేశ్, మెదక్ జిల్లాకు చెందిన మలావత్ శ్రీనుల సహకారంతో ఆ ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌లో షేర్ చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కోటి రూపాయలు ఉంటుందని, దీనిని అమ్మడం ద్వారా అందరం సెటిల్ అవుదామంటూ చర్చించుకున్నారు. ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందానికి సమాచారం వచ్చింది. దీంతో అటవీశాఖ అధికారులతో కొనుగోలుదారుల మాదిరిగా రూప్సింగ్ టీమ్‌ను సంప్రదించి.. తుక్కుగూడ క్రాస్‌రోడ్డులో సోమవారం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ప్రాణాలతో ఉన్న పంగోలిన్‌ను స్వాధీనం చేసుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.