సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్లలో నేరాల శాతాన్ని మరింత తగ్గించే విధంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని, ముఖ్యంగా పాత నేరస్తులపై నిఘా పెట్టి, వారు తిరిగి నేరాలకు పాల్పడకుండా చూడాలని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. రానున్న బోనాల పండుగ సందర్భంగా భద్రతా ఏర్పాట్లతోపాటు క్రైమ్ రివ్యూపై నేరేడ్మెట్లోని కమిషనరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, బోనాల పండుగ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని సూచించారు.
ప్రముఖ దేవాలయ ప్రాంగణాలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక వేడుకలు వంటి కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి, శాంతియుత వాతావరణంలో సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు ఇతర ప్రభుత్వ శాఖలను కూడా సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ఆయా ప్రాంతాల్లో సీసీటీవీల పనితీరును పరిశీలించాలని సూచించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ బృందాలు బందోబస్తులో ఉండాలని సూచించారు. క్రమం తప్పకుండా వాహనాల నంబర్ ప్లేట్లు, పత్రాల తనిఖీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ, డీసీపీలు అభిషేక్ మహంతి, జానకీ, రాజేశ్ చంద్ర, గిరిధర్, అనురాధ, బాలస్వామి, డీసీపీ సాయిశ్రీ, శ్రీ బాల, శ్రీనివాస్, మురళీధర్, ఇందిర, నర్మద, అదనపు డీసీపీలు షమీర్, శ్రీనివాస్, డీసీపీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.