సిటీబ్యూరో, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ): సైబర్ మోసాన్ని 24 గంటల్లో గుర్తించారు. వెంటనే సైబర్ క్రైం పోలీసులను సంప్రదించారు. ఫిర్యాదు అందుకున్న రాచకొండ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయడంతో వారు పోగొట్టుకున్న సొత్తులో రూ.68లక్షలు తిరిగి వచ్చింది. ఆ డబ్బును కోర్టు ద్వారా నవంబర్, డిసెంబర్ నెలల్లో నమోదైన 50 కేసుల్లోని బాధితులకు అందించారు.
కస్టమర్ కేర్, జాబ్స్, ఫిషింగ్, ఓటీపీ షేరింగ్, మని ట్రాప్, గిఫ్ట్, ఇన్వెస్ట్మెంట్ పేరిట నమ్మించిన సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి అందినకాడికి దండుకున్నారు. అయితే ఇలా మోసపోయిన వారు వెంటనే 155260, రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. ఆ తర్వాత నగదును వెనక్కి తెప్పించారు. లోక్ అధాలత్లో కేసులను మూసివేయించి బాధితులను నగదు అందజేసి ఊరట కల్పించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, వాట్సాప్, ఈమెయిల్స్ ద్వారా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి లాటరీ గెలిచారని చెబితే నమ్మవద్దు. కస్టమర్ కేర్ సర్వీసులను ఉపయోగించినప్పుడు వచ్చే ఫోన్ కాల్స్, కేవైసీ అప్డేట్, ఫేక్ మార్కెట్ ప్లేస్ ప్రకటనలకు దూరంగా ఉండాలి. వారి ఖాతాలకు నగదు బదిలీ చేయవద్దు. మోసపోయామని అనుమానం వస్తే వెంటనే 24 గంటల్లో 155260 లేదా డయల్ 100 లేదా సైబర్ క్రైం పోలీసులను సంప్రదించాలి. – హరినాథ్, సైబర్ క్రైం ఏసీపీ, రాచకొండ