Cyber Crime | సిటీబ్యూరో, మార్చి 30(నమస్తే తెలంగాణ): డబ్బు పెట్టకుండా వచ్చేది ఉద్యో గం… పనిచేసినందుకు ఆయా సంస్థల యజమాన్యాలు నెల, వారం, రోజు వారీగా జీతాలు, వేతనాలు ఇస్తుంటారు. ఉద్యోగం చేసేందుకు వెళ్లిన వారు ఎక్కడ కూడా డబ్బులు పెట్టుబడి పెట్టనవసరం లేదు. ఈ చిన్న లాజిక్‌ను మర్చిపోతూ చాలా మంది పార్ట్‌టైమ్ ఉద్యోగాలనగానే గుడ్డిగా నమ్మేసి సైబర్‌నేరగాళ్ల చేతిలో చిక్కి లక్ష రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో వచ్చే మెసేజ్‌లను చూసి అది నిజమని నమ్మి చాలా మంది ఆయా మెసేజ్‌లకు స్పందిస్తున్నారు. పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ ఇచ్చేవాళ్లు మొదట చెప్పే విషయాలు అన్ని నమ్మదగినవిగానే ఉంటాయి. మొదట ఎలాంటి పెట్టుబడి లేకుండానే రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు మీరు చేసిన పనికి జీతం వచ్చిందంటూ నమ్మిస్తారు. ఇంత వరకు బాగానే ఉంటుంది. ఆ తరువాత మీరు ఎక్కువగా టాస్క్‌లు పూర్తి చేస్తే ఎక్కువగా సంపాదించవచ్చంటూ చెప్పడంతో ఈజీగా బాధితులు బోల్తాపడుతున్నారు.
టాస్క్‌లు పూర్తి చేయాలంటే డబ్బు మేమెందుకు చెల్లించాలి? అంటూ అక్కడే అనుమానం వ్యక్తం చేస్తూ లోతుగా ఆరా తీస్తే మోసం బారినపడకుండా జాగ్రత్త పడే అవకాశాలుంటాయి. కానీ సైబర్‌నేరగాళ్లు పేరున్న హోటల్స్, సంస్థలకు సంబంధించిన రివ్యూలు, క్లిక్‌లు, సబ్స్క్రిప్షన్స్ చేయాలంటూ సూచించడంతోపాటు పేరున్న కంపెనీ పేరునే వాడుతుంటారు. దీంతో బాధితులు ఈజీగా వారి మాటలు నమ్మేస్తున్నారు.
అయితే టాస్క్‌లు పూర్తి చేసేందుకు మీరు మా సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బు చెల్లించాలంటూ చెప్పినప్పుడే అనుమానాలు రావాలి. ఉద్యోగమన్నారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్, టాస్క్‌లు అంటున్నారంటూ అనుమానాలు వ్యక్తం చేయాల్సిన బాధితులు నేరగాళ్లు చెప్పే విషయాలను విని ఈజీగా నమ్మి మోసపోతున్నారు. డబ్బులు ఈజీగా రావని, ఉద్యోగాల విషయంలో డబ్బు ప్రస్తావన వచ్చిందంటే అది మోసమని గుర్తించాలంటూ రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసుల సూచిస్తున్నారు.
ఇటీవల జరిగిన మోసాల్లో కొన్ని..
దమ్మైగూడలో నివాసముండే బాధితుడు ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతడి వాట్సాప్‌కు వర్క్‌ఫ్రమ్ హోమ్, ఫ్రీలాన్స్ జాబ్స్ అంటూ మెసేజ్ వచ్చింది. మీరు చేసే ఉద్యోగం ప్రొడక్ట్ రివ్యూస్ రాయడమని, మీకు ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేస్తూ వెళ్లే ప్రతిరోజు రూ. 1,500 నుంచి రూ.5,500 వరకు సంపాదించుకోవచ్చని సూచించారు. నిజమని నమ్మిన ఆ బాధితుడు వాళ్లు ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేసి మొదటి రోజు కొన్ని రివ్యూస్ రాయడంతో రూ. 799 తన బ్యాంకు ఖాతాలోకి వచ్చాయి.
ఆ తరువాత టెలిగ్రామ్ గ్రూప్‌లో నంబర్ యాడ్ చేసి మీరు మరింత సంపాదించుకోవాలంటే వాల్‌మార్ట్ స్పెషల్ ఈవెంట్ ఉందని, దానికి రూ.35వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు వస్తుందని, అందులో చేరితే మీరు లక్షల్లో సంపాదించవచ్చంటూ నమ్మించారు. డబ్బులు పెట్టిన తరువాత టెలీగ్రామ్ గ్రూప్‌లో మేం బాగా సంపాదించుకున్నామంటూ సైబర్ నేరగాళ్లే చర్చించుకుంటూ బాధితులను రెచ్చగొట్టారు. బాధితుడు వాళ్లు చెప్పినట్లు దఫదఫాలుగా రూ. 5,68,238 పెట్టుబడి పెడుతూ వెళ్లాడు. అయితే స్క్రీన్‌పై మాత్రం భారీగా డబ్బు కన్పించినా వాటిని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ఇదంతా మోసమని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జవహర్‌నగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అయిన బాధితుడికి వాట్సాప్‌కు వచ్చిన పార్ట్‌టైమ్ మెసేజ్‌కు స్పందించాడు. ప్రతిరోజు రూ.2వేల నుంచి రూ.8వేల వరకు సంపాదించుకోవచ్చని, అమెజాన్ ప్రొడెక్ట్‌కు సంబంధించిన రివ్యూ రాయాల్సి ఉంటుందంటూ నమ్మించారు. మొదట మీరు టాస్క్ పూర్తి చేశారంటూ రూ.365 ఇచ్చారు. దీంతో నమ్మకం ఏర్పడగానే టాస్క్‌లు పెంచుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చంటూ సూచించారు. ఇలా దఫ దఫాలుగా రూ.4.19లక్షలు సైబర్ నేరగాళ్లు బాధితుడి వద్ద నుంచి కాజేశారు.
మరో బాధితుడికి వాట్సాప్‌కు మెసేజ్‌లో గూగుల్‌లో రెస్టారెంట్స్, చారిత్రత్మాక కట్టడాలకు సంబంధించి గూగుల్ రివ్యూస్ రాయాలని, రోజు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు సంపాదించవచ్చంటూ నమ్మించారు. మొదట 30టాస్క్‌లు పూర్తి చేయగానే..రూ.500 మీ పేమెంట్ అంటూ బాధితుడి ఖాతాకు పంపించారు.మీరు పెట్టుబడి పెడితే ఎక్కువ టాస్క్‌లు వస్తాయని, దాంతో మీ సంపాదన కూడా బాగుంటుందంటూ నమ్మిస్తూ రూ. 5.70 లక్షలు దఫదఫాలుగా పెట్టుబడి పెట్టించి మోసం చేశారు.