ఘట్కేసర్, జనవరి 29: ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధి అంకుషాపూర్‌లోని ఏసీఈ ఇంజినీరింగ్ కళాశాలలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు నేతృత్వంలో రాచకొండ భద్రతా మండలి సహకారంతో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రోడ్డు భద్రత అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏసీఈ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు విజ్ఞాన్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల, సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు, బస్సు డ్రైవర్లు, ఆటోడ్రైవర్లు, శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్స్ చెందిన డ్రైవర్లు రోడ్డు భద్రతా శిక్షణ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
విద్యార్థులు డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. వేగానికి సంబంధించిన ప్రమాదాల ప్రభావాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాన్నారు. సీట్ బెల్టు, హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినా ప్రాణనష్టం ఉండదన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం వల్ల వాహనాలు నడిపే వారు, రోడ్డుపై వెళ్లే వారు క్షేమంగా ఉంటారని చెప్పారు.
ప్రమాదాలను నివారించడంలో పోలీసులకు మద్దతు ఇస్తూ ట్రాఫిక్ యోధులుగా ప్రతిఒక్కరూ మారాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. రహదారి భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ మార్షల్స్ యొక్క స్వచ్ఛంద సేవలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల్లో కుటుంబసభ్యులను కోల్పోయిన బాధితులతో మాట్లాడించారు. డీసీపీలు కె.మనోహర్, మల్లారెడ్డి, శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రమాద నివారణపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో చీఫ్ కోఆర్డినేటర్ ఎంఎస్. సావిత్రి ముథయాలా, రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్ ఎం.ఆర్.రాజేశ్, జగన్ యాద వ్, సూర్యనారాయణ, మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఇన్స్పెక్టర్లు పరశురాం, రాజువర్మ తదితరులు పాల్గొన్నారు.