సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ నెల 30వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన భద్రత, బందోబస్తుకు సంబంధించిన విషయాలపై ఠాణాల అధికారులకు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పలు సూచనలు చేశారు. గురువారం కమిషనరేట్ పరిధిలోని మాడ్గుల, యాచారం, ఇబ్రహీంపట్నం, మాల్ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సీపీ తనిఖీ చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో 24 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.40 కోట్ల నగదు సీజ్ చేశామన్నారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే కింది స్థాయి సిబ్బంది కూడా ఎన్నికల నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నామని, గత ఎన్నికలలో నేరాలు చేసిన వారిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మాడ్గుల పరిధిలో గత ఎన్నికల్లో 90 మంది నేరాలకు పాల్పడగా.. వారిని బైండోవర్ చేశామన్నారు.