R.Krishnaiah | కవాడిగూడ, మే 30 : కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండల కార్యాలయాలకు అనుగుణంగా అదనపు పోస్టులు సృష్టించి తక్షణమే వాటిని భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. యువతరాన్ని నేరుగా రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకురావడంతో అవినీతికి తావులేకుండా సమర్థవంతమైన పాలన సాగించవచ్చని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వ విభాగాలలోని అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఆరేళ్ల కిందట ఏర్పాటైన 23 జిల్లాల్లోని అన్ని విభాగాలలో ఇంచార్జీలతో ప్రభుత్వ పాలన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. పాత పోస్టులు, అదనపు బాధ్యతలతో ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించడం సరికాదని అన్నారు. దీంతో ఉద్యోగులపై పనిభారం పడటం తప్పితే రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. జిల్లా స్థాయిలో ఒక్కో అధికారిని మూడు నాలుగు విభాగాలకు ఇంచార్జీలుగా నియమిస్తే సజావుగా పనులు సాగవని చెప్పారు.
తెలంగాణలోని 23 జిల్లాల్లోని 40 శాఖలు, 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు ,76 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 4383 గ్రామపంచాయతీలతో పాటు అనేక పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డాయని ఆర్.కృష్ణయ్య తెలిపారు. వీటన్నింటిలో అనేక రకాల పోస్టులు ఖాళీగానే ఉన్నాయని చెప్పారు. వీటిలోని గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4లతో పాటు అన్ని సర్వీస్ పోస్టులను భర్తీ చేయడానికి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మెరిట్ అభ్యర్థులు అన్ని పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉన్నందున ప్రస్తుత పద్ధతి ప్రకారం వెయిటింగ్ లిస్ట్, ఆప్షన్ విధానంతో కాల పరిమితితో పోస్టుల భర్తీ చేయాలన్నారు. దీంతో పోస్టులు మిగిలిపోకుండా అందరికీ అవకాశం వస్తుందన్నారు. అన్ని రకాల టీచర్ పోస్టులను సైతం ఆప్షన్ విధానంలోనే భర్తీ చేయాలని కృష్ణయ్య ప్రభుత్వానికి సూచించారు. యువతను పాలనరంగంలోకి తీసుకువస్తే ఉత్సాహంగా అంకితభావంతో నిజాయితీగా పనిచేస్తారని చెప్పారు. యువత శక్తి యుక్తులను సమాజాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.