రవీంద్రభారతి, ఫిబ్రవరి21: దేశ వ్యాప్తంగా 60 శాతం ఉన్న ఓబీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఓబీసీలకు ఫీజు రీయిబర్స్‌మెంట్, గురుకుల పాఠశాలలు, రెసిడెన్సీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం, దక్షిణాది రాష్ర్టాల ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య విచ్చేయగా, సభకు ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.మారేశ్ సభాధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం మార్చ్ 12, 13 తేదీలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఏపీ భవన్‌లోని అంబేద్కర్ భవన్లో ఓబీసీ డిమాండ్లపై మేధావుల సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు హాజరవుతున్నారని కృష్ణయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణాది రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున 100పైగా కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు హాజరు కాబోతున్నాయని ఆయన తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు దాటినా ఓబీసీలకు మాత్రం రాజకీయ స్వాతంత్య్రం రాలేదని, పార్లమెంట్లో బీసీ బిల్లు సాధించడంతోనే ఓబీసీలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు.
దేశవ్యాప్తంగా కులగణన జరగవలసిన చారిత్రాత్మక ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నేడు ఓబీసీలపై దృష్టి సారించిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓబీసీల పక్షపాతి అని, మోదీతోనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. నేడు ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్నదని, ఈ దశలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. మార్చ్ 12,13వ తేదీల్లో చలో ఢిల్లీ బీసీ మేధావుల సదస్సును పెద్ద ఎత్తున ఓబీసీలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎన్.మారేశ్ మాట్లాడుతూ బీసీల ఆరాధ్య దైవం అయిన ఆర్.కృష్ణయ్య, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై చర్చించి ఒప్పించి రాజకీయ రిజర్వేషన్లు సాధించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీలు బీసీల రిజర్వేషన్లపైనే దృష్టి సారించాయని తెలిపారు. అనంతరం, మార్చ్ 12,13వ తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీ గోడ పత్రికను ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు. కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్ర ఓబీసీ సమాఖ్య అధ్యక్షుడు జబ్బుల శ్రీనివాస్, నీరడి భూపేశ్ సాగర్, సి.రాజేందర్, పితాను ప్రసాద్, నడిపిన శ్రీనివాసరావు, నీలం వెంకటేశ్, రాజశేఖర్, అనంతయ్య, చల్లా వరుణ్, లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.