కుత్బుల్లాపూర్, మే 15 : కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్‌నగర్ డివిజన్ పరిధి పైపులైన్ రోడ్డులోని మయూరిబార్ వెనుకాల ఈ నెల 11న చోటుచేసుకున్న హత్య కేసును పేట్‌బషీరాబాద్ పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్యన చోటుచేసుకున్న ఘర్షణలో ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన గణేశ్ (32) జులాయిగా తిరుగుతూ ఇంట్లో ఉన్న అమ్మ, చెల్లిని నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. గణేశ్ చేష్టలకు విసిగిపోయిన కుటుంబ సభ్యులు గత కొన్ని రోజులుగా ఇంట్లోకి రానివ్వడం లేదు. ఈ క్రమంలో స్థానికంగా వికృత చేష్టలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అక్కడినుంచి పారిపోయి నగర శివారు సుభాష్‌నగర్‌కు చేరుకున్నాడు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం ప్రాంతానికి చెందిన కాల సాయికిరణ్ తన అమ్మతో కలిసి సుభాష్‌నగర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో గణేశ్, సాయికిరణ్‌కు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి చోరీలకు పాల్పడుతూ మద్యం సేవించేవారు. రాత్రి అయితే ఫుట్‌పాత్‌లపై గడిపేవారు. కాగా ఈ నెల 10న ఉదయం సుభాష్‌నగర్ పైపులైన్ రోడ్డులోని మయూరిబార్ వెనకాల ఉన్న కంపెనీ వద్ద దొంగతనం చేసేందుకు సంచరిస్తుండగా అక్కడి వాచ్మెన్ వారిని నిలదీశాడు. ఫొటో తీసి పోలీసులకు పంపిస్తానని హెచ్చరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అప్పటికే మత్తులో ఉన్న ఇద్దరు సమీపంలో ఉన్న మయూరి బార్ వెనకాలకు చేరుకొని మద్యం సేవించారు. గణేశ్ అక్కడి నుంచి వెళ్లిపోదామని సాయికిరణ్‌కు చెప్పగా ఓపికలేదని ఇక్కడే పడుకుంటానని తెలిపాడు. దీంతో కోపోద్రిక్తుడైన గణేశ్ సాయికిరణ్‌ను పలుమార్లు కొట్టాడు. అయినా వినకపోవడంతో విచక్షణారహితంగా మెడను విరిచి, కంటిపై చెయ్యితో దాడి చేయగా కన్ను ఛిద్రమైపోయింది. మద్యం మత్తులో ఉన్న సాయికిరణ్ స్పృహకోల్పోయి అక్కడే పడిపోవడంతో అక్కడి నుంచి గణేశ్ వెళ్లిపోయాడు. ఈ నెల 11న ఉదయం 8:40 గంటలకు మృతదేహం ఉన్నదని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోవడంతో పాటు ఎండకు తట్టుకోలేక మృతి చెందాడని దర్యాప్తులో తేలింది. కాగా సాయికిరణ్ మృతికి కారకుడైన గణేశ్ కూకట్పల్లి పోలీసులకు ఓ కేసులో చిక్కడంతో సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపి రిమాండ్‌కు తరలించారు.
భార్యాభర్తలపై దాడి.. భర్త మృతి
గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ మామిడితోటలో ఉంటున్న వెంకటనాగరాజు(37)పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో భర్త వెంకటనాగరాజు మృతి చెందాడు. భార్యకు ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.