MLA KP Vivekananda | ‘దేశంలోనే అట్టర్ ఫ్లాప్ సీఎం రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్ నగర ప్రతిష్టను పూర్తిగా దిగజార్చారు.. ఫోర్త్ సిటీ పేరిట సీఎం కుటుంబసభ్యులు ఇన్సైడ్ ట్రెడింగ్ చేస్తున్నారు.. నగరంలో శాంతి భద్రతలు కంట్రోల్ తప్పాయి.. తాగు నీటికి కటకట ప్రారంభమైంది.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి.. హైదరాబాద్ నగరంపై సీఎంకు అవగాహన లేక.. పరిపాలన చేతకాకపోవడంతో నగర ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. భవిష్యత్ ఇచ్చిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క పైసా కేటాయించలేదు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో లేని లోటు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కరానికి ఎల్లవేళాల కృషి చేస్తా’ అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ‘నమస్తే’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలకు అందే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే…
-మేడ్చల్, నవంబర్ 28(నమస్తే తెలంగాణ)
నగర ప్రతిష్ట పూర్తిగా దిగజారింది..
హైదరాబాద్ నగర ప్రతిష్టను పూర్తిగా దిగజార్చి దేశంలోనే అట్టర్ ఫ్లాప్ సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్ నగరంపై అవగాహన లేక పరిపాలన చేత కాకపోవడంతో నగరంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. వేసవి కాలం ప్రారంభానికి ముందే తాగు నీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయి. మున్సిపల్ శాఖ సీఎం రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నా.. నగర అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం లేదు. కనీసం నగర అభివృద్ధిపై సమీక్షించిన దాఖాలాలు లేవు. ఇలా అయితే హైదరాబాద్ నగర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులే ఇప్పటికీ జరుగుతున్నాయి. వాటికి నిధులు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. దీంతో అభివృద్ధి పనులు పూర్తికావడం లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ కొనసాగిన సమయంలో నగర అభివృద్ధికి ప్రణాళికల అమలుకు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ హైదరాబాద్ నగరంలో నివసించే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం శ్రమించేవారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కరానికి లింకేజీ రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జాడకు కూడా కనిపించడంలేదు.
చేతి నిండా పని..కంటి నిండా నిద్ర..
కేసీఆర్ అధికారంలో లేని లోటు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నది. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలతో స్వర్ణయుగంలా ఉండేది. అన్ని వర్గాల ప్రజలకు చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉండేది. ఇప్పుడేమో పనులు లేక వలసలు వెళ్లే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. సీఎం రేవంత్ అసమర్థ పాలన వల్ల హైదరాబాద్‌కు పెట్టుబడులు రాక నూతన నిర్మాణాలు జరగాక పోవడ వల్ల రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలింది. ఈ క్రమంలో ప్రజలకు పనులు దొరకడం లేదు. హైదారాబాద్‌పై నిర్దిష్టమైన ప్రణాళిక సీఎం రేవంత్ చేయలేకపోవడం వల్లే హైదరాబాద్ నగరానికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. కేసీఆర్ సీఎంగా కొనసాగిన సమయంలో చేసిన అభివృద్ధి , అందించిన పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
ఇన్సైడ్ ట్రెడింగ్..
ఫోర్త్ సిటీ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఇన్సైడ్ ట్రెడింగ్‌కు పాల్పడుతున్నారు. సీఎం తన కుటుంబ సభ్యులు మాత్రమే బాగు పడేలా ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తున్నారు.
6 వేల కోట్లతో అభివృద్ధి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకర్గాన్ని రూ. 6 వేల కోట్లతో అభివృద్ధి చేశా. అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించినందునే నన్ను 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. చెరువుల సుందరీకరణ, పార్క్‌ల అభివృద్ధి, సీసీ రోడ్లు, తారు రోడ్లు, మంచినీటి సౌకర్యం, అండర్‌గ్రౌండ్ డ్రేనేజీల నిర్మాణాలు చేయించా. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా.
ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు. ప్రజల సమస్యలు పరిష్కరించనట్లయితే ప్రజలతో కలిసి పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతాం. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులే సక్రమంగా ఇవ్వడం లేదు. కుత్బుల్లాపూర్ నియోజవర్గంలో లింకేజీ రోడ్లకు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడి నిధులు రాబట్టా. లింకేజీ రోడ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 70 కోట్లను మంజూరు ఇచ్చింది. ఇచ్చిన నిధులను రాబట్టేందుకే ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చింది. అలాగే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణం ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణ చేసేలా చర్యలు తీసుకుంటున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాలకు భూ సేకరణ పనులను ప్రారంభించేలా అధికారులపై ఒత్తిడి తేస్తున్నా.
భవిష్యత్ ఇచ్చిన మల్కాజిగిరికే మొండిచెయ్యి
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు రేవంత్‌రెడ్డిని తిరస్కరిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఎంపీగా చేస్తే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్క పైసా మంజూరు చేసింది లేదు. సీఎం అయ్యేలా భవిష్యత్ ఇచ్చిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే బావుంటుంది. నార్త్ సిటీ అభివృద్ధిని సీఎం రేవంత్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు మెట్రో ఏర్పాటును బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే సీఎం రేవంత్‌రెడ్డి మెట్రో ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. మెట్రోపై ఇటీవల జరిగిన అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. భవిష్యత్ ఇచ్చిన జిల్లా ప్రజలకు మాత్రం సీఎం మెండి చెయ్యి చూపిస్తున్నారు.
గ్యారెంటీలు అందేవరకు పోరాటం చేస్తా..
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కేసీఆర్ నేతృత్వంలో పోరాటం చేసేందుకు సిద్ధమవుతా. 100రోజుల్లో ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా..మహిళలకు ఉచిత బస్సు తప్ప.. ఇంకా ఏ ఒక్క పథకాన్ని ప్రజలకు అందించలేదు. కాంగ్రెస్ ఇచ్చిన పథకాలపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం మేడలు వంచుతాం. రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట్ సహకారం సంఘంలో 632 మంది రైతులకు రుణమాఫీ చేయాల్సింది ఉంటే.. 11 మంది రైతులకు, దూలపల్లి సహకారం సంఘంలో 109 మంది రైతులుంటే 51 మందికి రుణమాఫీ చేసి మిగతా రైతులను మోసం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.