MLA KP Vivekanand | హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతున్నదని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆర్డినెన్స్‌ల పాలన తీసుకొచ్చారని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద్ విమర్శించారు. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు లోపల, బయట ఉన్న 51 గ్రామ పంచాయతీలను శివారు మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
అఖిలపక్ష సమావేశం పెట్టకుండా, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో చర్చించకుండా, గ్రామాలను విలీనం చేయడమేంటని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత, అసమర్థ నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో గురువారం బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తుంగ బాలుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మున్సిపల్‌శాఖ తన దగ్గరే ఉన్నదని, ఎవరితో మాట్లాడకుండా సీఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని నిలదీశారు. సీఎంకు అవగాహన లేకపోతే వేరొకరికి మున్సిపల్‌శాఖ అప్పగించాలని, కేంద్రీకృత వ్యవస్థను సీఎం ప్రవేశపెడుతున్నారని, రేవంత్ దురాశ దుఃఖానికి చేటు అవుతుందని హెచ్చరించారు.
భారం తప్ప..లాభం లేదు..
ఓఆర్ఆర్ లోపల మున్సిపాలిటీలను కలిపి హైదరాబాద్ మహా కార్పొరేషన్ చేయాలని జూలైలో సర్యులర్ జారీచేశారని, దానికి విరుద్ధంగా ఇప్పుడు నిర్ణయం వచ్చిందని వివేకానంద్ తెలిపారు. మౌలిక సదుపాయాలు లేకున్నా శివారు గ్రామాలు హైదరాబాద్‌తో సమానంగా పన్నులు కట్టాలా? అని ప్రశ్నించారు. గ్రామపంచాయతీలను మున్సిపాలిటీల్లో కలపడం వల్ల ప్రజలపై భారమే తప్ప లాభం లేదని చెప్పారు.
విలీనంపై లోతైన చర్చ జరగాలి
మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనాన్ని వెంటనే ఆపాలని కేవీ వివేకానంద్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి లోతైన చర్చ జరపాలని సూచించారు. 2,053 చదరపు కిలోమీటర్ల పరిధి గల కార్పొరేషన్‌తో కేంద్రీకృత వ్యవస్థ ఏర్పడితే ప్రజలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం అనాలోచిత చర్యలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నదని, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆదాయం నెలకు రూ.300 కోట్ల మేర తగ్గిందని చెప్పారు. హైడ్రా పేరుతో వసూళ్ల కార్యక్రమం జరుగుతున్నదని ఆరోపించారు.
ప్రజల హకులు కాలరాయడమే
ఒక మీటింగ్‌లోనే గ్రామాల విలీన నిర్ణయాన్ని క్యాబినెట్ సబ్ కమిటీ ఎలా తీసుకుంటుందని, ఇది ప్రజల హకులను కాలరాయడమేనని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. సంబంధితశాఖ మంత్రి లేకుండా క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటుందా? అని ప్రశ్నించారు. సీఎం బిజీగా ఉంటే మున్సిపల్‌శాఖను శ్రీధర్బాబుకో, సీతకకో అప్పగించాలని సూచించారు.వెంటనే ఆర్డినెన్సును రద్దు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.