Hyderabad | ఖైరతాబాద్, జూన్ 1 : వ్యాపారాలకు అడ్డు వస్తుందని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్టాప్‌నే మాయం చేసేందుకు కొందరు యత్నిస్తున్నట్లు తెలిసింది. పంజాగుట్ట ప్రధాన రహదారిలో గోకుల్ టవర్స్ ఎదురుగా దశాబ్దాలుగా బస్టాండ్ ఉంది. గతంలో ప్రయాణికులు అక్కడి ఫుట్‌పాత్ పైనే బస్సుల కోసం వేచి చూసే వారు. కూకట్పల్లి, అమీర్‌పేట మీదుగా ఖైరతాబాద్ వైపునకు వెళ్లే ప్రయాణికులతో పాటు నిత్యం నిమ్స్‌కు వచ్చే రోగులు, వారి సహాయకులు ఇదే బస్టాప్‌ను వినియోగించుకుంటారు.
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ బస్‌షెల్టర్‌ను నిర్మించడంతో పాటు స్టీలు కుర్చీ, బస్సుల రూట్‌ను తెలిపే సూచికబోర్డులను ఏర్పాటు చేశారు. ఇటీవల ఓ బేకరి బస్టాప్ వెనుక వెలిసింది. బస్టాప్ సరిగ్గా షాపునకు ఎదురుగా ఉంది. తమ వ్యాపారాలకు అడ్డుగా ఉందని భావించి బస్టాప్‌నే తొలగించే కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిసింది. తొలుత సూచికబోర్డులు మాయమయ్యాయి. శనివారం బస్టాప్‌లో ఉన్న స్టీలు సీట్లు సైతం కనిపించకుండా పోయాయి. వాటిని షాపు నిర్వహకులే తొలగించారంటూ పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ, పోలీసు అధికారులు దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.