సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ): వినూత్నమైన వ్యూహాలతో డ్రగ్స్, గంజాయి సరఫరా, విక్రయాలు చేస్తున్న నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశించారు. శనివారం ఎల్బీనగర్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన అంశాలను ప్రతి అధికారి పాటించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి కేసుల్లో శిక్షలు తప్పనిసరిగా పడేలా దర్యాప్తు, విచారణ కొనసాగాలని స్పష్టం చేశారు. 2021లో డ్రగ్స్, గంజాయి దందాకు సంబంధించి 100 కేసులు నమోదు చేయడంతో పాటు 6140 కేజీల గంజాయి, 400 కేజీల ఓపీయం, 7 లీటర్ల హశీశ్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నామని, 33 మంది పై పీడీయాక్ట్‌ను విధించినట్లు చెప్పారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, భువనగిరి డీసీపీ నారాయణ్‌రెడ్డి, క్రైం డీసీపీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.