GIS Survey | సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) సర్వే అటకెక్కిందా? డ్రోన్ సర్వే అంటూ తొలుత హడావుడి చేసిన యంత్రాంగం. .క్షేత్రస్థాయి సర్వే వచ్చే సరికి సదరు ఏజెన్సీ పనులు చేపట్టలేక చేతులెత్తేసిందా? జీఐఎస్ సర్వే పేరుతో రూ. 22 కోట్ల మేర ప్రజాధనం వృథా అయినట్టేనా? అంటే జీహెచ్ఎంసీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఇందుకు సదరు నియో జియో ఏజెన్సీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బల్దియా..నోటీసులు జారీ చేయడమే ఇందుకు కారణమని చెబుతూ వస్తున్నారు.
ఈ సర్వేపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతో ఈ ప్రక్రియ కేవలం ప్రకటనలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూలై 30న ప్రారంభించిన సర్వే ..ఇప్పటి వరకు ఎన్ని ప్రాంతాల్లో సర్వే చేశారు? ఎన్ని ఆస్తులను గుర్తించారు? డ్రోన్ సర్వేలు ఎక్కడెక్కడ చేశారు? ఇంటింటి సర్వేలు ఏ ప్రాంతాల్లో ఇప్పటి వరకు పూర్తి చేశారు..? ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? అనేది గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికంటే మించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లోని ఆస్తులను పన్నుల పరిధిలోకి తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన ఇంటిగ్రేటెడ్ సర్వే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ రియోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్ఈ)కి పురపాలక అప్పజెప్పింది.
జీహెచ్ఎంసీలో మాత్రం ప్రైవేట్ సంస్థ నియో జియో సంస్థకు అప్పగించింది. ఈ ఏజెన్సీకి రూ. 22 కోట్ల మేర జీహెచ్ఎంసీ చెల్లించాల్సి ఉంది. సదరు ఏజెన్సీ పనితీరు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో ప్రజాధనం వృథా అవుతుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఈ జీఐఎస్ సర్వేపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లలో 145 మంది ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, 340 మంది బిల్ కలెక్టర్లతో సర్వే చేయిస్తే మంచి ఫలితాలు వచ్చేదని పలువురు పలువురు డిప్యూటీ కమిషనర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అర్బన్ ప్లానింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్ను మెరుగుపరిచేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ఆస్తులు, యూటీలిటీస్ మ్యాప్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం సర్వేను నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఫిజికల్ సర్వేకు ప్రజలు సహకరించే పరిస్థితులు లేవన్న చర్చ బహిరంగంగానే జరుగుతున్నది. అధికారుల ప్రకటనలకు క్షేత్రస్థాయి పర్యటనలో ప్రజల నుంచి సేకరిస్తున్న వివరాలతో ఇప్పటికే ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. సర్వేకు వచ్చిన అధికారులు, సిబ్బంది జీహెచ్ఎంసీకి సంబంధించిన వారేనా? లేదంటే ప్రైవేట్ వ్యక్తులా? అన్న కోణంలో కొందరు? సమగ్ర వివరాలు ఇస్తే ఆస్తిపన్ను భారం మరింత పడుతుందని మరికొందరు? జీహెచ్ఎంసీ వద్ద వివరాలు ఉన్నప్పటికీ మళ్లీ ఎందుకు అడుగుతున్నారని మరికొందరు సర్వేకు దూరంగా ఉంటున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే ప్రక్రియ ఈ ఏడాది జూలై 30న ప్రారంభించారు. ఈ జీఐఎస్ సర్వేకు జీహెచ్ఎంసీ దాదాపు రూ. 22 కోట్ల మేర ఖర్చు చేస్తున్నది. గ్రేటర్ పరిధిలో ప్రతి ఆస్తిని, నిర్మాణాన్ని, ఖాళీ ప్లాట్లను, నివాసాలను, వ్యాపార భవనాలను గుర్తించి మ్యాపింగ్ చేసేందుకు గరిష్ఠంగా 18 నెలల గడువు తీసుకుని 20 లక్షల ఆస్తులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే గడిచిన మూడు నెలల్లో 15వేల ఆస్తులను మాత్రమే లెక్కించినట్టు అధికారులు చెబుతున్నారు. మూడు నెలల్లో కనీసం 15వేల ఆస్తుల గుర్తింపునకే పరిమితమైతే సదరు ఏజెన్సీతో వచ్చే 15 నెలల్లో 20 లక్షల ఆస్తుల గుర్తింపు సాధ్యమేనా.. అన్న ప్రశ్న తలెత్తుతున్నది.