ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 18: హబ్సిగూడలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన బాలిక కుటుంబంతో పాటు తీవ్రంగా గాయపడిన ఆటోడ్రైవర్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కొమురెల్లి బాబు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ నో ఎంట్రీ సమయంలో భారీ వాహనాలు నగరంలోకి అనుమతించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. నో ఎంట్రీ సమయంలో భారీ వాహనాలను అనుమతించకూడదని కోరారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేస్తున్నారే తప్ప..పూర్తిస్థాయిలో నియంత్రించడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు జోగు రాములు, శ్రీహరి, హుస్సేన్, శివ, రవికాంత్, వెంకట్‌గౌడ్, సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.