దుండిగల్: గాజులరామారం సర్కిల్ అధికారుల నిర్లక్ష్యంతో తమ కాలనీలో చేపట్టాల్సిన 30 ఫీట్ల రోడ్డు నిర్మాణపనులు నిలిచిపోయాయని కైలాశ్హిల్స్ కాలనీవాసులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో కాలనీ పక్కనే ఉన్న ఓ నిర్మాణ సంస్థ 30 ఫీట్ల రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్షం రోజులుగా ఈ తతంగం నడుస్తున్నా సర్కిల్ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నారు. సదరు నిర్మాణ సంస్థతో అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడం కారణంగానే అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు.