బడంగ్‌పేట, అక్టోబర్ 10: బడంగ్‌పేటలో చెత్త పంచాయితీ చిలికి చిలికి గాలివానగా మారింది. చెత్త ఎక్కడ వేయాలో తెలియక.. చెత్త ఆటోలను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పార్కింగ్ చేసి నిరసన చేపట్టారు. చెత్త ఆటో రిక్షా యజమానులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. చెత్త సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. చెత్త ఆటోల నిర్వాహకులు అధికారులకు, మేయర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అయినా, సమస్య పరిష్కారం కాలేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుర్మల్‌గూడలో చెత్త డంప్ చేసేందుకు వెళితే అక్కడి స్థానికులు వేయనీయడం లేదని చెబుతున్నారు. అదేవిధంగా.. ఉప్పల్‌లో కూడా చెత్త వేయనివ్వడం లేదని తెలిపారు. జవహర్‌నగర్‌లో కూడా వేయనివ్వడం లేదంటే.. మరి ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్తను ఎక్కడ వేయాలని ప్రశ్నిస్తూ.. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆటోలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 65 చెత్త రిక్షాలను మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉంచి నిరసన తెలిపారు. చెత్త వేయడానికి డంపింగ్ యార్డు ఉన్నా.. స్థానికులు అడ్డుకోవడంతో సమస్య జఠిలమైంది.
పాలక వర్గ సభ్యులకు మాత్రం చెత్త సమస్యను పరిష్కరించాలన్న జాస లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధుల తీరు పట్ల కాలనీ వాసులు సైతం మండి పడుతున్నారు. కుర్మల్‌గూడలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో చెత్త వేయనీయమంటే ఎలా అని కమిషనర్ రఘుకుమార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుర్మల్గూడలోనే చెత్త వేయిస్తామని ఆయన తెలిపారు. మరోసారి కుర్మల్‌గూడ వాసులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కమిషనర్ తెలిపారు