బడంగ్పేట్, ఆగస్టు 24: పేదలు నివాసముండే కాలనీలను 22ఏలో పెట్టడాన్ని నిరసిస్తూ.. సోమవారం బాలాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చింతలకుంట కాలనీవాసులు ఆందోళనకు దిగారు. చింతలకుంటను 22ఏ నుంచి తొలగించాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్ చింతల కుంట రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 2/1లో 8 ఎకరాల్లో 119 పాట్లు, 115 ఇండ్లు ఉన్నాయని మాజీ కార్పొరేటర్లు రవినాయక్, చవ్వ శ్రావణ్‌కుమార్ తదితరులు పేర్కొన్నారు.
47 ఏండ్ల కిందట కాలనీ ఏర్పడినట్లు కాలనీవాసులు చెప్పారు. 2017లో రిజిస్ట్రేషన్లు చేశారని గుర్తు చేశారు. 2025లో మున్సిపల్ నుంచి పర్మిషన్లు, డోర్ నంబర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నిలిపివేశారన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.