
కవాడిగూడ, అక్టోబర్ 29: పురిటి నొప్పులతో దవాఖానకు వస్తే వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో తన భార్య కోమాలోకి వెళ్లిందని, తన పుట్టిన బిడ్డ కూడా చనిపోయిందని ఆరోపిస్తూ.. బాధితురాలి భర్త, ఆమె తల్లిదండ్రులు, బంధువులు, టీఆర్ఎస్ నాయకులు ముషీరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు రూ. 21.80 లక్షలు కట్టించుకొని..ఇంకా చెల్లించాలని వైద్యులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు దవాఖాన వైద్యాధికారులతో మాట్లాడుతుండగా, సిబ్బంది, కుటుంబసభ్యుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ముషీరాబాద్‌కు చెందిన దుబ్బాక శిల్ప(28)కు పురిటినొప్పులు రావడంతో 16న మూషీరాబాద్ కేర్ దవాఖానకు చికిత్స కోసం తీసుకొచ్చారు. ఆమెకు డెలివరీ చేయగా, పుట్టిన బిడ్డ అనారోగ్యంతో ఉందని వైద్యులు కుటుంబసభ్యులకు చెప్పారు.
ఈ క్రమంలో శిశువును నిలోఫర్‌కు పంపించారు. అక్కడ శిశువు చికిత్స పొందుతూ చనిపోయింది. శిల్ప పరిస్థితి ఆందోళనగా ఉందని కేర్ వైద్య సిబ్బంది బంజారాహిల్స్‌లోని దవాఖానకు తరలించారు. ఆమె కోమాలోకి వెళ్లడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నదని శిల్ప భర్త ప్రభాకర్, తండ్రి రాజేశ్వర్ గౌడ్, తల్లి శోభలు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 21.80 లక్షలు కట్టించుకున్నారని ఆరోపించారు. వైద్యం కోసం మరిన్ని డబ్బులు చెల్లించాలని వేధిస్తున్నారన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిల్ప తీవ్ర ఆనారోగ్యానికి గురైందని ఆరోపిస్తూ.. మూషీరాబాద్ దవాఖాన ఎదుట శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. శిల్ప కుటుంబ సభ్యులు, వారికి మద్దతుగా స్థానిక టీఆర్ఎస్ నాయకులు నర్సింగ్ ప్రసాద్, శ్రీనివాస్, బాబు, అజయ్ ముదిరాజ్, భిక్షపతి యాదవ్ తదితరులు దవాఖాన ముందు ధర్నాకు దిగారు. శిల్పకు న్యాయం జరిగేంత వరకు ఊరుకునేది లేదని బైఠాయించారు.ముషీరాబాద్ పోలీసులు దవాఖాన వద్దకు చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.