Hyderabad Metro | సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు మెట్రో రెండో దశలో అదనంగా 4 మెట్రో కారిడార్లను చేర్చాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మెట్రో ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి విన్నవించారు. నగర జనాభాలో సుమారు 40 శాతం వరకు ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో నివాసం ఉన్నారని, వీరంతా ప్రజా రవాణా వ్యవస్థలపైనే ఆధారపడి ఉంటారన్నారు. అలాంటి వారి కోసం మెట్రో రైలు సౌకర్యాన్ని నిర్మించాలని కోరుతూ మెట్రో ఎం.డీకి లేఖను అందించారు.
ఉత్తర హైదరాబాద్ ప్రాంతం మీదుగానే ఉత్తర తెలంగాణలోని జిల్లాలైన మేడ్చల్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు నిరంతరం రాకపోకలు సాగిస్తుంటారని మెట్రో ఎం.డీకి వివరించారు. ఈ ప్రాంతంలో వేలాది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా వినియోగిస్తున్నారని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధి సంపత్‌రెడ్డి పేర్కొన్నారు.
నివాస ప్రాంతాలతో పాటు పారిశ్రామిక వాడలైన బాలానగర్, జీడిమెట్ల, ఖాజీపల్లి, మేడ్చల్, జీనోమ్ వ్యాలీ, శామీర్‌పేట ఉండగా, ప్రముఖ విద్యా సంస్థలు బిట్స్, నల్సార్, ఐపీఈ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఎయిర్‌పోర్స్ అకాడమీ, దుండిగల్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, హకీంపేట, నిసా, స్పోర్ట్స్ స్కూల్స్ వంటివి ఈ ప్రాంతంలోనే ఉన్న నేపథ్యంలో మెట్రో రెండో దశలో 4 మార్గాలను అదనంగా కలిపి పనులు చేపట్టాలని మెట్రో ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డిని కోరారు.
1. బాలానగర్-షాపూర్‌నగర్-సూరారం- గండిమైసమ్మ
2. బోయిన్పల్లి- సుచిత్ర- కొంపల్లి- మేడ్చల్
3. జూబ్లీ బస్ స్టేషన్ -అల్వాల్- తూంకుంట
4. తార్నాక-ఈసీఐఎల్ ఎక్స్ రోడ్- నాగారం-కీసర