MLA Talasani | బేగంపేట్, డిసెంబర్ 19 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం ఉదయం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో జరిగిన పార్టీ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఆచరణకు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమల్లోకి తీసుకువచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒకరికీ, కాలనీ, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అండతోనే తన విజయం సాధ్యమైందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులు తిరిగి ప్రారంభమవుతాయని, అదేవిధంగా కొత్తగా మంజూరైన పనులు సంక్రాంతి తరువాత ప్రారంభిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్, కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్లు అత్తెల్లి అరుణ, ఎన్.శేషుకుమారి, ఆకుల రూప, కిరణ్మయిలతో పాటు డివిజన్ల అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, కొలను బాల్‌రెడ్డి, అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, శ్రీనివాస్‌గౌడ్ లతో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.