Drugs | సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ మత్తుకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నగరంలోని పలు పబ్బులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టీజీ న్యాబ్ అధికారులు కలిసి దాడులు జరిపారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన పబ్బులకు నోటీసులు జారీ చేశారు. పబ్బుల్లో పట్టుబడిన మత్తు బాబులకు డ్రగ్స్ విక్రయించిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. నగరంలోని కొన్ని పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి టీజీ న్యాబ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కలిసి జూబ్లీహిల్స్‌లోని నికాస్ పబ్బు, బేబీలాన్, ఇల్లూజియాన్, మాదాపూర్‌లోని విస్కీ పబ్బులతో పాటు నాలెడ్జ్ సిటీ గేట్ నం.6లోని ఉన్న క్వారమ్ క్లబ్‌పై దాడులు జరిపారు. ఈ దాడుల్లో భాగంగా 33 డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్‌తో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో బేబీలాన్, క్వారమ్ పబ్‌లో కలిపి మొత్తం నలుగురికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్‌కు చెందిన చిన్న నగేశ్, శ్రీకాకుళం నివాసి నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్‌కు చెందిన అబ్దుల్ రహీం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మరో పబ్బులో 20 ఏండ్ల యువకుడికి మద్యం సరఫరా చేసినట్లు గుర్తించిన అధికారులు.. సదరు పబ్బుకు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి డ్రగ్స్ ఎవరు విక్రయించారనే అంశంపై దర్యాప్తు చేపట్టామని, వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.విషన్, రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్‌రెడ్డి, అదనపు ఎస్పీ భాస్కర్, డీఎస్పీ తిరుపతి యాదవ్, టీజీ న్యాబ్ అధికారులు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.