బంజారాహిల్స్, మార్చి 25: చోరీలు చేసేందుకు భార్యాభర్తల అవతారం ఎత్తారు. పనికోసం వచ్చామంటూ నమ్మబలికి సంపన్నుల ఇంట్లో చేరారు. యజమానులు ఊర్లో లేని సమయం చూసి తమ సహచరులతో కలిసి పక్కా స్కెచ్‌తో భారీ చోరీకి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ ముఠాలోని ముగ్గురు సభ్యులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లోని ఓబుల్‌రెడ్డి స్కూల్ సమీపంలోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనిరుద్‌రెడ్డి, దీపికారెడ్డి దంపతులు నివాసం ఉంటారు. వారిద్దరూ ఊఠీ, కూర్గ్ తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు.
ఈ క్రమంలో మార్చి 5న వారిద్దరూ ఇంటికి తాళం వేసి వ్యాపారం పనిమీద ఊటీ వెళ్లారు. ఆ ఇంట్లో 45రోజుల క్రితం భార్యాభర్తమంటూ తోటమాలీగా పనిలో చేరిన నేపాల్‌కు చెందిన మహేష్ షాహీ అలియాస్ ప్రకాష్(30), అప్సర అలియాస్ మాయ(30)తో మరో ముగ్గురు నేపాలీ గ్యాంగ్ సభ్యుల సహకారంతో ఈనెల 13న అర్ధరాత్రి తర్వాత కట్టర్స్, రాడ్స్‌తో ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్రూమ్లోని అల్మారాలను పగలగొట్టి సుమారు రూ.2కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్‌లు, రాడో వాచ్‌లు, బంగారు, వెండి ఆభరణాలు తస్కరించారు.
ఈ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల ప్రత్యేక బృందాలు దేశంలోని పలు నగరాలతో పాటు నేపాల్ సరిహద్దుల్లో మొహరించారు. కాగా చోరీ సొత్తును తలాకొంత పంచుకున్న నిందితులు ఢిల్లీతో పాటు ఇతర నగరాలకు పారిపోగా మహేష్ షాహీ, అప్పర పోలీసుల కళ్లుగప్పి సరిహద్దు దాటారు. దాదాపు 10రోజులు వారికోసం కాపుకాసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నేపాల్ వెళ్లి నిందితులను పట్టుకున్నారు. స్థానిక కోర్టులో వారిని హాజరుపర్చిన అనంతరం విచారించగా చోరీ సొత్తులో కొంతభాగం తీసుకుని నరేష్ అనే వ్యక్తి ఢిల్లీకి వెళ్లాడని తేలడంతో అతడిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మహేష్ షాహీ, అప్సర ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని, చోరీ స్కెచ్‌లో భాగంగా భార్యాభర్తలుగా సంపన్నుల ఇంట్లో ప్రవేశిస్తుంటారని పోలీసుల విచారణలో తేలింది. కాగా చోరీలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోందని తెలుస్తోంది. చోరీ అయిన సొత్తులో కొంత రికవరీ అయినప్పటికీ ఎక్కువ సొత్తు ఇంకా లభ్యం కాకపోవడంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.