ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 18: ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ విమర్శించారు. భావిభారత పౌరులను తయారుచేసే విశ్వవిద్యాలయ అధ్యాపకులు తమ అన్యాయంపై నెలన్నర రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినైట్లెనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో వర్సిటీలో జరిగిన సీఏఎస్ ప్రమోషన్లలో 48 మంది అధ్యాపకులకు ప్రమోషన్లు నిరాకరించారని చెప్పారు. దీనిని నిరసిస్తూ మంగళవారం ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మనోహర్ మాట్లాడుతూ ఇంటర్వ్యూలలో వారి పనితీరు బాగాలేదని రిజెక్ట్ చేయడం సమంజసం కాదన్నారు.
సీఏఎస్ అనేది పనితీరు ఆధారంగా ఇచ్చే ప్రమోషన్లు కావని, అవి కేవలం వారి సీనియారిటీ, అవసరమైన పరిశోధనా పత్రాలు ఉంటే ఇయ్యాల్సినవని చెప్పారు. ప్రమోషన్లు అధ్యాపకుల హక్కు అని, అవి ఎవరి దయాదాక్షిణ్యాల ఆధారంగా పొందేవి కావని మండిపడ్డారు. గడిచిన యాభై ఏళ్లలో ఏ అధ్యాపకుడి ప్రమోషన్ కూడా ఈ విధంగా రిజెక్ట్ చేసిన దాఖలా లేదని గుర్తు చేశారు. కానీ 48 మంది ప్రమోషన్లు రిజెక్ట్ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉత్తమ అధ్యాపక అవార్డు, ఉత్తమ రిసర్చర్ అవార్డు పొందిన వారికి సైతం ప్రమోషన్లు నిరాకరించారని వివరించారు.
కానీ ఎలాంటి పనితీరు లేని కొంతమంది అధ్యాపకులకు మాత్రం ప్రమోషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అన్ని అర్హతలు ఉన్న అధ్యాపకుల ప్రమోషన్లు నిరాకరించడం బాధాకరమన్నారు. ఓయూ అధికారులు అధ్యాపకుల విషయంలో ఇంటర్వ్యూ సరిగా చేయలేదని కుంటి సాకులు చెబుతున్నారని దుయ్యబట్టారు. రిజెక్ట్ చేసిన వారిలో అర్హతలు ఉన్న ప్రతీ అధ్యాపకుడికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై ఓయూ వీసీకి అధ్యాపకులు వినతిపత్రాలు అందజేశారని చెప్పారు. ప్రభుత్వంలోని మంత్రులకు దీనిపై వినతిపత్రాలు అందజేసినా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఔటా ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ సురేందర్‌రెడ్డి, అధ్యాపకులు అరవింద్, వెంకటేశ్వర్రావు, వెంకటదాస్, నతానియల్, రమేశ్, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.