ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 17: రాష్ట్రంలో మెరుగైన ఉచిత విద్య, మెరుగైన ఉచిత వైద్యం అనేది ఒక ఉద్యమంలా సాగాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం అన్నారు. అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం చేర్చే వరకు పోరాడాలని సూచించారు. తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో ‘ప్రజల ప్రాథమిక హక్కు – ప్రభుత్వాల కనీస బాధ్యత’ అనే అంశంపై ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్ సదస్సును సోమవారం నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కాశీం మాట్లాడుతూ ఐదు దశాబ్దాల క్రితం పెద్ద బాలశిక్ష చదివిన వాళ్లకు ఉన్న నైపుణ్యం ప్రస్తుతం ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి సైతం ఉండడం లేదని అన్నారు. డిగ్రీ పట్టాలు ఇస్తే సరిపోదని, విద్యలో నైపుణ్యం నేర్పించాలని చెప్పారు. ఉన్నత విద్య అభ్యసించిన వాళ్లు కూడా స్కిల్స్ లేకపోవడంతో చిన్న ఉద్యోగాలకు పోటీ పడుతున్నారని అభిప్రాయపడ్డారు. పీజీలు చదువుతూ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని ఉదహరించారు.
ఉన్నత విద్యకు బడ్జెట్ కేటాయింపుల్లో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యా వ్యవస్థను నిషేదించకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యావ్యవస్థ నిలబడలేదన్నారు. ఓయూ రూ.వెయ్యి కోట్లు నిధులు కేటాయించి, ఖాళీగా ఉన్న 800 ఉద్యోగులు భర్తీ చేస్తే మరో 30 ఏళ్లు ఓయూ ఉన్నత, నైపుణ్య విద్యను అందిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్‌రెడ్డి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ రాజీవ్, డాక్టర్ చెరుకు సుధాకర్, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, నాయకులు దాసరి శశాంక్, కర్రే సత్యనారాయణ, యువరాణి, పుల్లూరి రాజు, విప్లవ్‌కుమార్, రాజ్‌కుమార్, సురేశ్‌నాయక్, సందీప్, శివ, గోపి, మహేందర్, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.