చిక్కడపల్లి, జూన్ 30: సిగాచీ ఇండస్ట్రీస్‌లో 2025 జూన్ 30న జరిగిన అగ్రి ప్రమాద ఘటనలో చనిపోయిన కార్మికుల కుంటుంబాలకు ఇప్పటికీ ఎక్స్‌గ్రేషియా ఇవ్వకపోవడంపై ప్రొఫెసర్ హరగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా మంగళవారం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ), హెచ్ఆర్ఎఫ్, ఎన్ఏపీఎం, ఏపీసీఆర్ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందర్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రగతి ప్రస్థానంలో మానవ ప్రాణం ఎంత చౌక వస్తువుగా మారిందో చెప్పడానికి పాశమైలారంలోని సిగాచీ ఇండస్ట్రీస్ పేలుడు ఘటన సజీవ సాక్ష్యం అని అన్నారు. ఈ ఘటనలో మరణించిన 54మంది కార్మికుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయిల పరిహారం ఇప్పటికీ అందక పోవడం దారుణం అన్నారు.
సాక్ష్యాత్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా ఇప్పటికీ అందించకపోవడం దుర్మార్గం అని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం హామీకే దిక్కులేకపోవడం దేనికి సంకేతమని హరగోపాల్ ప్రశ్నించారు. టీపీజేఏసీ కోకన్వీనర్ కన్నెగంటి రవి మాట్లాడుతూ.. 54 మంది బాధితులకు ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ప్రకటించగా.. ఇప్పటికి చెల్లించిన సగటు పరిహారం కేవలం 45 లక్షలు మాత్రమే అని తెలిపారు.
సీఎం ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయక పోవడం సరికాదన్నారు. హెచ్ఎఆర్ఎఫ్ అధ్యక్షుడు జీవన్‌కుమార్, పర్యావారణవేత్త డాక్టర్ బాబూరావు, టీపీజేఏసీ నాయకుడు అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్ఏపీఎం నాయకులు మీర సంఘమిత్ర, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ఈఆర్ కొండల్ రావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు అనురాధ, పద్మ, బాలరాజు, కుల అసమానతల నిర్మూలన వేదిక నాయకులు లక్ష్మయ్య, రైతు స్వరాజ్య వేదిక నాయకుడు విస్సా కిరణ్, పలువురు బాధితులు తదితరులు పాల్గొన్నారు.