సిటీబ్యూరో/బంజారాహిల్స్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): అడుగడుగునా పోలీసు నిర్బంధం..మూడువేల మందితో బలగాల మోహరింపు.. కేసీఆర్‌ను సిట్ విచారించే క్రమంలో ఆ ప్రాంతంలో వెళ్లాలంటేనే భయపడిపోయిన దుస్థితి.. బంజారాహిల్స్ రోడ్డునెంబర్ 14లోని నందినగర్ కేసీఆర్ నివాసం వద్ద ఎటుచూసినా ఖాకీల హడావిడి.. సామాన్యులు హోటళ్లకు వెళ్లలేక, రోగులకు కావాల్సిన పాలు, పండ్లు దొరకక వారు పడిన అవస్థలు వర్ణనాతీతం..మఫ్టీలో ఇంటిలిజెన్స్, సివిల్‌లో టాస్క్‌ఫోర్స్,తో పాటు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా నీడలో ఏనిముషానికి ఏం జరుగుతుందోనంటూ పోలీసులు అలజడి సృష్టించారు. మరోవైపు నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో వ్యాపారవాణిజ్య సముదాయాలన్నీ బలవంతంగా మూసేయించడంతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది.
నందినగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడువేల మంది పోలీసులను మోహరించారు. నందినగర్ వద్ద ముగ్గురు డీసీపీలు రమణారెడ్డి, రఘునాథ్ వైభవ్ గైక్వాడ్, రక్షితాకృష్ణమూర్తి, పదిమంది ఏసీపీలు,ఆదిభట్ల నుంచి బంజారాహిల్స్ వరకు ఉన్న పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, డీఐలు, టాస్క్‌ఫోర్స్, ఇంటలిజెన్స్, ట్రాఫిక్, క్విక్ రెస్పాన్స్టీమ్స్,ఎస్బీ, 20 ప్లాటూన్ల ఏఆర్ పోలీసులతో పాటు ఎస్ఐలు, ఇతర కానిస్టేబుళ్లు సుమారు మూడువేల మందికిపైగా పోలీసులతో యుద్ధక్షేత్రాన్ని తలపించేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నిరసనల నేపథ్యంలో అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ నందినగర్ వైపుకు రాకుండా అడ్డుకున్నారు.
నందినగర్ కేసీఆర్ నివాసం సమీపంలోని నందినగర్ బస్‌స్టాప్, క్యాన్సర్ ఆసుపత్రి చౌరస్తా, వెంకటేశ్వరనగర్, బ్రహ్మకుమారీస్ తదితర ప్రాంతాలన్నిటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతీరోజూ వ్యాపారాలతో బిజీగా ఉండే ఈ ప్రాంతాల్లోని వ్యాపారవాణిజ్య సముదాయాలన్నిటినీ పోలీసులు బలవంతంగా మూసేయించారు. అయితే ఉదయమే టిఫిన్ సెంటర్లు, టీస్టాల్ వద్దకు వచ్చే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న రోగుల బంధువులు ఆ ప్రాంతంలో ఏ హోటల్ తెరిచిలేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. పోలీసుల ఓవర్‌యాక్షన్‌తో స్విగ్గీ, జొమాటో తదితర ఈ కామర్స్ డెలివరీ బాయ్స్ కూడా నందినగర్ రాలేకపోయారు. కేసీఆర్ ఇంటి లేన్‌లో నివాసముంటున్న వారు రాకపోకలు సాగించే క్రమంలో వారిని పోలీసులు గుచ్చిగుచ్చి ప్రశ్నించిన తీరుకు తీవ్ర అసహనానికి గురయ్యారు.