TGS RTC | సిటీబ్యూరో: సరిపడా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో గ్రేటర్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు సంతకాల సేకరణ చేసి ఆర్టీసీ అధికారులకు అందించారు. మరోవైపు ఉచిత బస్సు స్కీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
దీంతో ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ప్రెస్ల్లో 20 శాతం రద్దీ పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి రీజియన్ పరిధిలోని 8 డిపోల పరిధిలో మహిళా ప్రయాణికుల సంఖ్య మిగిలిన డిపోలతో పోలిస్తే అధికంగా ఉంది. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే వారు సైతం ఉచిత ప్రయాణంతో బస్సులపై ఆసక్తి చూపిస్తున్నారు. దిల్సుక్నగర్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, కూకట్పల్లి, మియాపూర్, కోఠి, నాంపల్లి, ఎస్ఆర్నగర్, అమీర్పేట బస్టాండ్లు మహిళా ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి…
గ్రేటర్లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా కనీసం 7వేల బస్సులు సమకూర్చాల్సిన అవసరం ఉందని రవాణా రంగ నిపుణులు నివేదికలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ బస్సుల సంఖ్య గ్రేటర్ జనాభాకు తగ్గట్టు పెంచలేదు. ఆర్టీసీ నష్టాల కారణంగా బస్సుల సంఖ్య పెంచలేకపోతున్నామంటూ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో 2800 బస్సులు రాకపోకలు సాగిస్తుండగా, ఇందులో ప్రస్తుతం 2600 బస్సులు నడుస్తున్నాయి. 30వేల ట్రిప్పులు కొనసాగుతున్నాయి. ఇవి సరిపోవడం లేదు.
మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీం రాక ముందు గ్రేటర్లో రోజుకు 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవారని అధికారులు చెబుతున్నారు. ఉచిత ప్రయాణం వచ్చాక ఒక్క రోజుకు 21 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రెట్టింపు స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సులన్నీ రద్దీని తలపిస్తున్నాయి. బస్టాపుల్లో ప్రయాణికులు బస్సు ఎక్కాలంటేనే నిల్చొవడానికి కూడా స్థలం దొరకని దుస్థితి నెలకొంది. బస్సుల సంఖ్య పెంచి ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.