తెలుగు యూనివర్సిటీ, మే 6: రైల్వేల ప్రైవేటీకరణను వెంటనే ఆపడంతోపాటు రైల్వేలో ప్రయాణికుల భద్రతపై రక్షణ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన భారతీయ రైల్వేలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టొద్దని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.
ధర్నాలో పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ రైల్వేలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతోందని విమర్శించారు. రైల్వేల ప్రవేటీకరణతో ఇప్పటివరకు సామాన్య ప్రజానీకానికి అతి చవకైన రవాణా సౌకర్యంగా ఉన్న రైల్వేప్రయాణం దూరం చేసినట్లవుతుందని అన్నారు.
ఇప్పటికే రైల్వే యాజమాన్యం ప్యాసింజర్ రైళ్లని తగ్గించిందని, ఎక్స్పెస్ రైళ్లలో జనరల్ బోగీలను తగ్గించి పేద సామాన్య, ప్రజల నడ్డి విరుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టి టికెట్ల ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వాటిని దూరం చేసిందని అన్నారు. రైల్వేల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం వెంకటేశ్, రైల్వే సీనియర్ నాయకులు శివకుమార్, ఎల్లయ్య, సీఐటీయూ నాంపల్లి జోన్ కన్వీనర్ సీ మల్లేశ్, నాయకులు.. అర్షద్ అహ్మద్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.