GHMC | సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ మరోవైపు అనవసరపు ఖర్చు విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు..ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలకే అపసోపాలు పడుతున్న తరుణంలో ప్రైవేట్ సైన్యాన్ని దింపుతోంది…ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల తరహాలో వ్యవహరిస్తున్నది. వాస్తవంగా కోటికి మంది జనాభాకు పైగా పౌర సేవలందించే జీహెచ్ఎంసీలో మార్షల్స్ అక్కర్లేదు…ఆరు నెలలకోసారి జరిగే జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఘర్షణ జరుగుతుందని భావించే సందర్భంలోనే మార్షల్స్ సేవలు అవసరం పడతాయి..కానీ ఏడాది రెండు సార్లు జరిగే కౌన్సిల్ సమావేశం పేరిట తాత్కాలికంగా మార్షల్స్‌ను తీసుకోకుండా..ఏడాది పొడవున శాశ్వతంగా ఔట్సోర్సింగ్ పద్ధతిన 10 మంది మార్షల్స్‌ను నియమించుకునేందుకు సిద్దమైంది.
ఔట్సోర్సింగ్ పద్దతిన మార్షల్స్, విజిలెన్స్ మేనేజర్స్, విజిలెన్స్ అసిస్టెంట్స్, రిసెఫ్షనిస్ట్లు కలిపి మొత్తం 38 మందిని నియమకాన్ని ఏజెన్సీ ద్వారా భర్తీ చేసేందుకు టెండర్ పిలిచారు. ఈ 38 మందికి గానూ ఏటా రూ. 1,34,19,900లు ఖర్చు చేయనుంది. దీనికి తోడుగా 75 మంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించనున్నారు. వీరికి ఏడాదికి రూ.1,94,86,350లు ఖర్చు చేస్తారు. ఏటా రూ. 3కోట్లకు పైగా ప్రైవేట్ సైన్యం పేరిట ఖజానాకు భారం మోపేందుకు మార్గం సుగమమం చేశారు. ఈ టెండర్ ప్రక్రియను ఈ నెల 27న ముగించి ఎజెన్సీని ఎంపిక చేసి వీరిని భర్తీ చేయనున్నారు. హైడ్రా ఏర్పాటుతో జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలో పనిచేసిన సిబ్బంది అంతా హైడ్రాకే వెళ్లడం జరిగిందని, ప్రస్తుతం 57 మందితో నెట్టుకువస్తున్నామని అధికారులు సమాధానం చెబుతున్నారు.
కొత్తగా 75 మంది సెక్యూరిటీ సిబ్బంది, 38 మంది విజిలెన్స్ విభాగంలో అవసరమని నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటున్నారు. మార్షల్స్ విషయంలో మాత్రం కార్పొరేషన్ అని మరిచి..కార్పొరేట్ తరహాలో భావించి ప్రొఫెషనల్‌గా ఉంటుందన్న సమాధానాలు అధికారుల నుంచి వస్తుండడం గమనార్హం. మొత్తంగా తమ అక్రమాలకు, పాలన పరమైన లోపాలను ఎత్తిచూపకుండా అడ్డుగోడగా ఉండేందుకే ఈ మార్షల్స్ నియమించుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కమిషనర్ ఇలంబర్తి తనను కలిసేందుకు వచ్చిన వారికి నిబంధనలు ఆమలు చేస్తున్నారు..పేషీలో పోలీసు బలగాలను ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు..ప్రజాప్రతినిధులకు సైతం కేటాయించిన సమయంలోనే కలుస్తున్నారు..మరోవైపు సందర్శకుల ఎంట్రీని కఠినతరం చేశారు. ఎవరిని కలిసేందుకు వచ్చారు? ఏ పని? అంటూ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద సెక్యూరిటీ పెట్టి మరీ సందర్శకుల వివరాలను రిజిస్టర్లో పొందుపర్చిన తర్వాతనే వారిని లోనికి అనుమతిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఆంక్షల నడుమ నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమ గోడును చెబుకుందామని వచ్చే ఆర్జీదారులు తొలుత కఠిన పరీక్షలు దాటాల్సిన తర్వాతనే ప్రజావాణి ప్రాంగణంలోకి వెళ్లాల్సిన దుస్థితి. ఆర్జీదారులు తొలుత తమ వెంట తెచ్చుకున్న సెల్‌ఫోన్‌ను డిపాజిట్ చేయాలి? ఆ తర్వాత టోకెన్ తీసుకున్న తర్వాతనే తమ సమస్యను చెప్పుకునేందుకు అనుమతి ఉంటుంది..ఈ విదానంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్న భద్రత దృష్ట్యా తప్పదని అధికారులు సెలవిస్తున్నారు. అంతేకాదు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని బీజేపీ కార్పొరేటర్ ఒకరు కమిషనర్‌ను కలిసినప్పుడు కుదరని తేల్చి చెప్పడంతో సదరు కార్పొరేటర్ అవాక్కైన పరిస్థితి.. ముఖ్యంగా రోజూ వారీ విజిటర్స్‌కు కూడా కమిషనర్ కలవాలంటే తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా కొత్తగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 75 మంది సెక్యూరిటీ గార్డులకు నియమించుకునేందుకు రంగం సిద్దం చేశారు. ఈ మేరకు ఒక్కొక్కరికీ రూ.18200ల చొప్పున ఏడాదికి రూ.16380000లు ఈపీఎఫ్ రూపంలో రూ.1755000లు, ఈఎస్ఐ 3.25 శాతం చొప్పున రూ.532350లు, ఏజెన్సీ కమిషన్ రూ.819000లు కలిపి మొత్తం ఏటా రూ.1,94,86,350లు ఖర్చు చేయనున్నారు.