హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో చట్ట విరుద్ధంగా ప్రైవేట్ జెట్లు, హెలీకాప్టర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వాణిజ్యయాన(కమర్షియల్) విమానాలపై నిషేధం ఉన్నప్పటికీ పలువురు ప్రముఖులు వాణిజ్యేతర విమానాలుగా తప్పుడు పత్రాలు సమర్పించి ఈ విమానాశ్రయం సేవలు వినియోగించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఈ విమానాశ్రయం జనావాసాల మధ్య ఉండడంతో సమీప ప్రాంతాల జనం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
విమానయాన మంత్రిత్వశాఖ, శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య 2008లో కుదిరిన ఒప్పందం ప్రకారం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఎటువంటి కమర్షియల్ ఫ్లైట్స్ సేవలు కొనసాగించకూడదు. ప్రభుత్వ ప్రముఖులు, పోలీస్, రక్షణ రంగం సహా నాన్- కమర్షియల్‌కు సంబంధించిన ఇతర విమానాలకు మాత్రమే అనుమతి ఉంది. అయినా అక్కడ నిత్యం చిన్నతరహా కమర్షియల్ ఫ్లైట్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఎంతోకాలంగా ఇది జరుగుతున్నా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతరం అందరి దృష్టి బేగంపేట ఎయిర్‌పోర్టుపై పడింది. చుట్టూ దట్టమైన జనావాసాల మధ్య ఈ విమానాశ్రయం ఉండడంతో స్థానికులు ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీనటులు, వారి కుటుంబ సభ్యులు తరచూ ఈ విమానాశ్రయాన్ని వినియోగిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అనంతరం కూడా ఈ రాకపోకలు యథావిథిగా కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు.