అది పెద్ద పేరున్న ఓ కాలేజీ. అందులో ఫీజులు లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. గ్రూపుల వారీగా సెక్షన్లను ఏర్పాటు చేసి.. వాటికి వినసొంపైన పేర్లు పెట్టి ధరలు నిర్ణయించారు. ఇక వారు చెప్పిన ఫీజు చెల్లించాల్సిందే. లేదంటే విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవమాన భారం తప్పదు. ఇదేంటని ప్రశ్నిస్తే తమను ఎవ్వరూ ఏం చేయలేరని యాజమాన్యాలు బెదిరింపులకు దిగుతున్నాయి. అధికారులందరికీ సూట్‌కేసులు పంపిస్తామంటూ ఆ కళాశాల ప్రిన్సిపాల్, జీఎంలు చెప్పడం కొసమెరుపు.
Intermediate Fees | సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ విద్య పూర్తి చేయాలంటే రెండేండ్లకు ఫీజు ఎంతో తెలుసా? కేవలం రూ.3520 మాత్రమే. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. ఇంటర్ విద్య ట్యూషన్ ఫీజు ఏడాదికి కేవలం రూ. 1760 అని ప్రభుత్వమే నిర్ణయించిందని.. జిల్లా ఇంటర్ బోర్డు అధికారి తెలిపారు. కానీ ఈ ఆదేశాలు కేవలం పేపర్లకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ప్రతీ కాలేజీల్లో ఏడాదికి రూ.45 వేల నుంచి లక్ష యాభై వేల వరకు విద్యార్థుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. ఇంటర్ పూర్తి చేయడానికి రెండేండ్లలో రూ.3-4 లక్షల వరకు ఖర్చు వస్తున్నదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఫీజులు వసూలు చేస్తున్నా.. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. స్వయంగా ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోకుండా చేతులెత్తేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంటర్ కాలేజీల ఏర్పాటు పెద్ద మాఫియాను తలపిస్తున్నదని విద్యానిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో మొత్తం 374 ఇంటర్ కాలేజీలు ఉంటే..ఇందులో 275 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ప్రతి కాలేజీలో 9 సెక్షన్ల ఏర్పాటుకు అనుమతి ఉంటుంది. ప్రతి సెక్షన్‌కు 88 మంది విద్యార్థులు ఉంటారు. ఈ లెక్కన మొదటి, ద్వితీయ సంవత్సరానికి మొత్తం విద్యార్థులు 1584 మంది వరకు ఉంటారు. ఈ నిబంధనల ప్రకారం ఇంటర్ కాలేజీ నడుచుకోవాలి. అయితే కొన్ని కాలేజీల్లో ఈ సంఖ్య మించిపోతున్నది. ఈ లెక్కన ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు ప్రకారం రూ. 52.80 లక్షలు ఉంటుంది. కానీ ప్రైవేటు కాలేజీలు వసూలు చేస్తున్న డబ్బు తెలిస్తే కండ్లు బైర్లు కమ్ముతాయి. సగటున ఒక విద్యార్థి నుంచి రెండేండ్లకు కనీసం లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారనుకున్నా.. 1500 మంది విద్యార్థులకు ఫీజు 15 కోట్ల రూపాయలు అవుతుంది. ఇంత డబ్బు కేవలం ఒక్క కాలేజీ రెండేండ్లలో విద్యార్థుల నుంచి దోచుకుంటున్నది. ఇది కేవలం ఫీజు మాత్రమే.. అదనంగా ల్యాబ్, కంప్యూటర్ ఫీజులు, ఉన్నత చదువుల కోచింగ్ ఫీజులు అంటూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 వేల నుంచి 50 వేల వరకు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. ఇవి కూడా కలిపితే సుమారు మరో రూ. 5-7 కోట్లు అదనంగా దోచుకుంటున్నారు.
హైదరాబాద్‌లో ప్రైవేటు కాలేజీల ఫీజు దోపిడీని నియంత్రించేందుకు, ఫీజుల ఒత్తిడితో నలిగిపోతున్న తల్లిదండ్రులు జిల్లా ఇంటర్ బోర్డు అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఆ కార్యాలయం ఎక్కడ ఉందో కూడా కనీసం తెలియని దుస్థితి. నాంపల్లిలోని మహబూబియా కాలేజీ కాంపౌండ్ లోపల ఓ మూలకు ఉంది. ఆ కార్యాలయం బోర్డు కనీసం ప్రధాన మార్గంలో ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. కార్యాలయం అడ్రస్ కోసం తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. కాగా, తల్లిదండ్రులు ఫీజుల దోపిడీపై 040-29700934, మొబైల్-9848781805 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు లేదా లేఖ రూపంలో అధికారుల దృష్టికి తీసుకురావొచ్చు.
ప్రైవేటు కాలేజీల్లో అధిక ఫీజులు వసూలు చేయకూడదు. ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్ణయించిన ఫీజు ఏడాదికి రూ.1760 మాత్రమే. కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందలేదు. మాకు ఫిర్యాదు వస్తే..ఆ కాలేజీలకు నోటీసులు జారీ చేస్తాం. వివరణ తీసుకుంటాం. ఉన్నతాధికారులకు ఆ కాలేజీపై చర్యల కోసం నివేదిక పంపిస్తాం. తదుపరి ఆదేశాలతో ఆ కాలేజీ సీజ్ చేస్తాం. అనుమతి లేకుండా అకాడమీల పేరుతో ఇంటర్ కాలేజీ పిల్లలకు కోచింగ్‌లు నిర్వహించకూడదు.
– ఒడ్డెన్న, హైదరాబాద్ ఇంటర్ బోర్డు అధికారి
చైతన్య, నారాయణ వంటి కాలేజీల్లో జరుగుతున్న ఫీజు దోపిడీపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోవడం లేదు. ఫీజులు చెల్లించలేక చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు నలిగిపోతున్నారు. నిబంధనలు పాటించని కాలేజీలను సీజ్ చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
-ప్రదీప్, అధ్యక్షుడు, ప్రగతిశీల యువజన సంఘం.