చర్లపల్లి, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖైదీల సంక్షేమానికి జైళ్ల శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా తెలిపారు. చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం (ఓపెన్ జైలు)లో ఆయుర్వేద గ్రామం, కోల్డ్‌ప్రెస్ అయిల్ యూనిట్‌ను హైదరాబాద్, వరంగల్ రేంజ్ జైళ్ల శాఖ డీఐజీలు డాక్టర్ శ్రీనివాస్, సంపత్, అసిస్టెంట్ డైరక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎన్ఎం.ఖాలీద్ అక్తర్‌లతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడంతోపాటు ఖైదీల పునరావాసానికి దోహదపడే మోడల్ ప్రాజెక్ట్ ఆయుర్వేద గ్రామమని ఆమె తెలిపారు.
అయుర్వేద చికిత్సలు, థెరపీలు నామమాత్రపు చార్జీలతో అందుబాటులో ఉంటాయన్నారు. అర్హత కలిగిన ఖైదీలకు నిపుణుల పర్యవేక్షణలో అయుర్వేద చికిత్స, వెల్నెస్ సేవలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు జైలు జీవితం అనంతరం ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. సంప్రదాయ పద్ధతిలో రసాయనాలు లేకుండా నూనెల తయారీకి కోల్డ్‌ప్రెస్ అయిల్ యూనిట్ ఎంతో ఉపయోగపడుతుందని, కోల్డ్‌ప్రెస్ నూనెలకు డిమాండ్ ఉన్న నేపధ్యంలో వ్యవసాయక్షేత్రంలో యూనిట్ ప్రారంభించామని ఆమె తెలిపారు.
యూనిట్ ద్వారా ఖైదీలకు నూనెల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, పరిశుభ్రత నిర్వహణ, నాణ్యత నియంత్రణ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జైలు శాఖలో సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం సమృద్ధి, పునరావాసంపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం ఆమె ఖైదీలు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయక్షేత్రం, కేంద్ర కారాగారం సూపరింటెండెట్లు భరత్, ప్రమోద్, అయుర్వేద వైద్యులు వైబీ.రమేశ్, గౌతం, డిప్యూటీ సూపరింటెండెట్లు కళిదాస్, శ్రీమాన్‌రెడ్డి, జైలు సిబ్బంది, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.