Chanchalguda Jail | సిటీబ్యూరో: చంచల్‌గూడ జైల్లో నకిలీ బెయిల్ పేపర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ బెయిల్ పేపర్లతో చంచల్‌గూడ జైల్లో అండర్ ట్రయల్‌లో ఉన్న సుజాత్ అలీ అనే నిందితుడు జైలు నుంచి బయటపడ్డాడు. ఈ వ్యవహారంలో జైలు అధికారులు, సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
విచారణ ఖైదీగా ఉన్న మరో వ్యక్తి సహాయం చేయడంతో సునాయాసంగా సుజాత్ అలీ జైలు నుంచి బయటపడ్డాడు. ఈ వ్యవహారంపై డబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. సంతోష్‌నగర్‌కు చెందిన మీర్ సుజాత్ అలీఖాన్‌పై నవంబర్ 2న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతరం అతడిపై మరో కేసు కూడా నమోదైంది. మొదటి కేసులో రాజేంద్రనగర్ కోర్టు నుంచి సుజాత్ అలీఖాన్ బెయిల్ పొందాడు. అయితే మరో కేసు పెండింగ్‌లో ఉండడంతో జైలు నుంచి విడుదల కాలేదు.
జైల్లో ఉన్న నిందితులకు సంబంధించిన బెయిల్ పత్రాలు రోజు వారీగా టప్పాలో వేస్తారు. ఈ బెయిల్ పేపర్లను పరిశీలించి జైలు అధికారులు బెయిల్ పొందిన వారిని బయటకు పంపిస్తుంటారు. బెయి ల్ పత్రాలు పరిశీలించే చోట విచారణ ఖైదీగా ఉన్న రాము అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. సుజాత్ అలీ జైల్లో ఉండగానే రాముతో పరిచయం చేసుకున్నాడు. ఒక కేసులో బెయిల్ వచ్చి, మరో కేసులో బెయిల్ రాకపోవడంతో తనను బయటకు పంపిస్తే డబ్బిస్తానంటూ మాట్లాడుకున్నాడు.
ఇందులో భాగంగానే గతంలో పొందిన బెయిల్ పేపర్లో తేదీలను మార్చేసి, సంతకాలు ఫోర్జరీ చేసి కొత్తగా నకిలీ బెయిల్ పత్రాలను తయారు చేశారు. అవి టప్పాలో వేశారు. వాటిని పరిశీలించిన రాము అంతా బాగున్నాయని సుజాత్కు బెయిల్ వచ్చిందంటూ అధికారులకు చెప్పడంతో అతడిని రిలీజ్ చేశారు. అయితే సుజాత్పై ఉన్న మరో కేసుపై విచారణ చేసేందుకు పీటీ వారెంట్‌తో పోలీసులు అక్కడకు వచ్చి జైలు అధికారులను అడుగగా అతడు బెయిల్‌పై విడుదలయ్యాడంటూ.. అధికారులు చెప్పారు. దీంతో అతనికి బెయిల్ రాలేదంటూ చెప్పడంతో జైలు అధికారులు అతడిచ్చిన బెయిల్ పత్రాన్ని, ఆన్లైన్లో తనిఖీ చేసి పక్కా ప్లాన్‌తో సుజాత్ మోసం చేశాడని గుర్తిం చి డబీర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.