బంజారాహిల్స్ : దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అభివృద్దిలో ముందుకు దూసుకువెళ్తున్న తెలంగాణ రాష్ట్రం మీద అక్కసుతోనే ప్రధాని మోడీ మరోసారి విషం చిమ్మారని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరైన పద్దతిలో జరగలేదంటూ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో బుధవారం భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఆయా ప్రాంతాలనుంచి బైక్ ర్యాలీలు అసెంబ్లీ సమీపంలోని గన్ పార్కువద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నాయి. వారంతా ప్రధాని మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ..సుమారు ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలు చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్రం ఏర్పాటు చేశారని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు.
రాష్ర్ట విభజనద్వారా ఏపీకి అన్యాయం జరిగిందంటూ మోడీ మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదమన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా రెండు తెలుగు రాష్ట్రాలకు ఏమాత్రం సాయం అందించని ప్రధాని మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రం పట్ల తన అక్కసును వెల్లగక్కారని పేర్కొన్నారు.