అబిడ్స్ : నగరానికి చెందిన పలువురు పూజారులు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పని తీరు బాగుందని, శాంతి భద్రతల పరిరక్షణ బాగుందని కొనియాడారు.
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎంకే బద్రుద్దీన్ ఆధ్వర్యంలో పూజారులు మంత్రిని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వదించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కొనియాడారు. అదే విధంగా శాంతిభద్రతల పరిరక్షణ, అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కిందన్నారు.
రాష్ట్రంలో అన్ని మతాల వారు సోదరభావంతో మెలగడం గర్వ కారణమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో లబ్ది పొందుతున్నారని వివరించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను తీసుకు వస్తున్నారని కొనియాడారు.