సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు బాధితులపై ఒత్తిడి పెరుగుతోంది. భూసేకరణ, ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, పరిహారం విషయంలో స్పష్టత రానంత వరకు ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదంటూ బాధితులు తేల్చి చెబుతుండటంతో..భూసేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. బాధితులు ఓ వైపు న్యాయపోరాటం, మరో వైపు ఉద్యమ బాట పట్టారు. అయినా గడిచిన ఆరు నెలలుగా నిర్వహించిన ఐదారు గ్రామసభలు, ఒక ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలను బాధితులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
కానీ ప్రభుత్వం అభ్యంతరాలపై వివరణ ఇవ్వాల్సిందేనంటూ తాజాగా నోటీసులు జారీ చేస్తున్నది. బాధితుల ఇంటింటి గోడలపై నోటీసులను అంటిస్తూ ఈ నెల 27న జరిగే ప్రజాభిప్రాయ సేకరణకు రావాలని ఆదేశిస్తున్నారు. ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని ఇప్పటికే బాధితులు కుండ బద్ధలు కొట్టినట్లుగా చెబుతున్నా… పట్టించుకోవడం లేదు. కానీ సమావేశాలకు రావాలంటూ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తమ సమస్యలను పరిష్కరించకుండా భూముల విషయం తేలదని చెబుతూనే…ఆందోళన చేసేందుకు బాధితులు సన్నద్ధమవుతున్నారు.
భూసేకరణ అధికారుల ఒత్తిడి
హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వాల్సిందేనంటూ భూసేకరణ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుండా భూములు ఇచ్చేది లేదని చెబుతున్నా… పట్టించుకోకుండా.. ప్రజాభిప్రాయ సేకరణకు రావాలంటూ భవన యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. బాధితులు అందుబాటులో లేకున్నా… ఇంటి గోడలపై నోటీసులను అంటించి వెళ్తున్నారు. ఇలా భూములు ఇచ్చేంత వరకు వదిలేది లేదన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. అయితే తమ సమస్యలను పరిష్కరించకుండా, భూ సేకరణకు సహకరించేది లేదని బాధితులు స్పష్టంగా చెబుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణకు రావాల్సిందే..
బాధితులు ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని తెలుసుకోకుండా… అధికారులు కూడా భూసేకరణ విషయంలో పట్టుబడుతున్నారు. ప్రాజెక్టు వెడల్పును 200 మీటర్ల నుంచి 100-150 మీటర్లకు తగ్గించడం వల్ల ఎంతో మంది భూ యజమానులకు ఊరట కలుగుతుందని, కానీ ప్రభుత్వం ఆ విషయమే పట్టించుకోకుండా ఒంటెద్దు వ్యవహరం చేస్తున్నదని మండిపడుతున్నారు. ఇక పరిహారం విషయంలోనూ తమకు స్పష్టమైన హామీ రాలేదని వాపోతున్నారు. అసమగ్రమైన సమాచారంతో తమ ఆస్తులను ఎలా అప్పగిస్తామని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 27న లక్డీకాపూల్లోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రతి భూ యజమాని హాజరు కావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.