సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్. డి.పి) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా రూ.5112.36కోట్ల అంచనా వ్యయంతో 47 ప్రాజెక్టులు చేపట్టింది. అందులో భాగంగా రూ. 629.30కోట్లతో చేపట్టిన ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు ఆరు లేన్లతో 119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర చేపట్టిన భారీ ఫ్లై ఓవర్‌ను వచ్చే నెల 3న ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే మంగళవారం కమిషనర్ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వాటర్‌వర్క్స్ ఈడీ మయాంక్ మిట్టల్ ఇతర అధికారులతో కలిసి ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ నెల 30 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
సర్వీస్ రోడ్డు నిర్మాణానికి మొత్తం 17 ఆస్తులను సేకరించాలని, ప్రస్తుతం పని జరిగేందుకు 5 ఆస్తులు సత్వరమే సేకరణ చేసిన పక్షంలో.. పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందని సీఈ దేవానంద్ కమిషనర్‌కు వివరించారు. సమస్య పరిష్కారానికి జోనల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, నష్ట పరిహారం చెల్లింపునకు సంబంధిత ప్రతిపాదనను త్వరగా పంపిస్తే వెంటనే మంజూరు చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఎస్ఈ దత్తుపంతు, జోనల్ కమిషనర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్లు రవికుమార్, అరుణ, ఈఈ, డీప్యూటీ ఈఈలు తదితరులు పాల్గొన్నారు.