సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): నకిలీ బాండ్ పేపర్లు తయారు చేస్తున్న ఇద్దరిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ సంఖ్యలో బాండ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ నర్సింహారావు కథనం ప్రకారం.. బహదూర్‌పురా బారాదారి కాలనీకి చెందిన మహ్మద్ సయ్యద్ అజారుద్దీన్, హుస్సేనీ ఆలంకు చెందిన మహ్మద్ ఇనాయత్ అలీ, ఫలక్‌నుమాకు చెందిన ఫిరోజ్ కలిసి పాత, కొత్త తేదీలతో బాండ్ పేపర్లు తయారు చేసి.. అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. దీంతో పాటు అవసరమైన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నకిలీ స్టాంపులు కూడా తయారు చేస్తున్నారు. రూ. 100, 50, 20 నోటరీ స్టాంప్ పేపర్లు, పాతకాలం నాటి ఒకటి, రెండు, ఐదు, 75 పైసల బాండ్ పేపర్లను సైతం తయారు చేస్తున్నారు. అవసరమైన వారికి ఆయా స్టాంపులను విక్రయిస్తున్నారు. నిందితులిచ్చిన బాండ్ పేపర్లను ఉపయోగించిన కొందరు కోర్టులో లిటిగేషన్ కేసులు కూడా వేశారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ, రెవెన్యూకు సంబంధించిన నకిలీ స్టాంపులను కూడా తయారుచేసి అవసరమైన చోట వాడుతున్నారు. ఈ కేసులో ఫిరోజ్ పరారీలో ఉండగా.. మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ కేసు హుస్సేనీ ఆలం పోలీసులకు అప్పగించారు.