శంషాబాద్ రూరల్, మార్చి15: జిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందింది. ఈ విషాద ఘటన శంషాబాద్ మండలంలో జరిగింది. సీఐ నరేందర్రెడ్డి, బాధితుల వివరాల ప్రకారం మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామానికి చెందిన ప్రమీల గర్భం దాల్చినప్పటి నుంచి ముచ్చింతల్లోని ‘జిమ్స్’లో వైద్యం చేయించుకుంటున్నది. ఈ నెల 11న వైద్యశాలకు వచ్చిన ప్రమీలను 13 వరకు అబ్జర్వేషన్లో ఉంచిన డాక్టర్ పూజిత అనంతరం మందులు రాసిచ్చి నొప్పులు వస్తే తిరిగి వైద్యశాలకు రమ్మని చెప్పి ఇంటికి పంపించేసింది.
అయితే ఇంటికి వెళ్లిన ప్రమీల డాక్టర్ రాసిచ్చిన మందులు వేసుకోగానే పురిటి నొప్పులు రావడంతో పాటు ఛాతిలో నొప్పి వస్తుందని భర్త సాయిబాబుకు చెప్పగా వెంటనే ఆయన శుక్రవారం రాత్రి 10.30 గంటలకు జిమ్స్ దవాఖానకు తీసుకొచ్చాడు. అక్కడ సిబ్బంది పట్టించుకోక పోవడంతో పాటు వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో ప్రమీల చెమటలు పట్టి పడిపోయింది. మధ్యరాత్రి 12.00 గంటలకు వచ్చిన డాక్టర్ రామారావు ఆమెను పరిశీలించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.
అక్కడ పోస్టుమార్టం నిర్వహించి ప్రమీల కడుపులోని 9 నెలల బాలుడిని బయటికి తీశారు. ఇదిలా ఉంటే జిమ్స్ వైద్యులతో పాటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.