సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : దసరా పండుగకు ఊరెళ్తున్నారా ? ఓ పక్క ఆర్టీసీ బస్సులు రద్దీ.. మరోపక్క రైళ్లు కిటకిట.. ఇంకో వైపు ట్రావెల్స్ భారీ వసూళ్లు.. వీటి మధ్య సొంత వాహనంలోనే హాయిగా ప్రయాణించడం మేలు అనుకొని నగరవాసులు తమ సొంతూళ్లకు బయలుదేరుతుంటారు. ప్రయాణించాల్సిన దూరం, మార్గంపై ముందస్తు ప్రణాళిక వేసుకుంటే ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా, హాయిగా గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వాహన పరిమితికి సరిపడా ఎంతమంది వెళ్లొచ్చో..అంతేమంది ప్రయాణిస్తే ఎలాంటి సమస్యలు ఎదురుకావని సూచిస్తున్నారు. రవాణా శాఖ అధికారులు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. సీటుబెల్ట్, హెల్మెట్లు ప్రాణ రక్షకులు అని తప్పకుండా వాటిని ధరించాలని చెబుతున్నారు. మరోవైపు వాహన సంఘాలు సైతం సెల్ఫీ విత్ సీట్ బెల్ట్ కార్యక్రమంపై ప్రచారం చేస్తున్నాయి.