బంజారాహిల్స్, మే 26: బస్తీలు, కాలనీల్లో చెత్త సమస్యలను పరిష్కరించడంతో పాటు పరిశుభ్రకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రీ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను మేయర్ ప్రకటించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా బంజారాహిల్స్ వార్డులోని అన్ని బస్తీలు, కాలనీల్లో14 మంది సభ్యులతో కూడిన బృందాలు పర్యటించి చెత్తకుప్పలు తొలగించడం, నిర్మాణ వ్యర్థాలను తొలగించేలా అవగాహన కల్పించడం, దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించనున్నారని అన్నారు.
శానిటేషన్ విషయంలో ఫిర్యాదులు లేకుండా ప్రతి వీధిలో క్రమం తప్పకుండా చెత్త తొలగింపు జరిగేలా చూస్తామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఇండ్లలోని చెత్తను స్వచ్ఛ ఆటోలకు ఇవ్వకుండా రోడ్లపై పారవేయడమే అత్యంత ప్రధానమైన సమస్యగా మారిందని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. శానిటేషన్ అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజల భాగస్వామ్యం ద్వారానే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా జలమండలి జీఎం హరిశంకర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు జలమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని అన్నారు. దీనిలో భాగంగా మ్యాన్‌హోళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. మ్యాన్‌హోళ్ల మూతలను తొలగించవద్దని కోరారు. వారంరోజుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ది పనులను పూర్తిచేస్తామని చెప్పారు. సిబ్బంది ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏజెన్సీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.