సిటీబ్యూరో, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): చిన్నచినుకు పడితే కరెంటు పోతున్నది. గాలి గట్టిగా వీచినా ఇండ్లలో చీకటి రాజ్యమేలుతున్నది. ఇది గ్రేటర్ హైదరాబాద్ సిటిలో, శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికపై ఎస్పీడీసీఎల్ అధికారులు దృష్టి పెట్టారు.
అయితే పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాకు కావాల్సిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయని విద్యుత్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చిన్నపాటి వర్షం, ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. చెట్లు కూలిపోవడం, తీగలపై పడడం వంటి మేజర్ సమస్యలు ఉన్నచోట ఇబ్బంది అయినప్పటికీ..
చాలాచోట్ల సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో సరిదిద్దిన ఫీడర్లు, డీటీఆర్లు ఈ వర్షాలకు దెబ్బతిన్నాయి. కేవలం పదిహేనురోజుల వ్యవధిలో కురిసిన వర్షాలకు నగరంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తమైంది. అధికారులు రంగంలోకి దిగినప్పటికీ గంటల తరబడి, కొన్ని ప్రాంతాల్లోనైతే ఒకరోజు మొత్తం సరఫరానే లేకుండా పోయింది.