ప్రమాదకరంగా స్తంభాలు..కంచెలు లేని ట్రాన్స్ఫార్మర్లు.. కాలం చెల్లిన పరికరాలు… క్షేత్రస్థాయిలో విద్యుత్ నెట్వర్క్ తీరిది. ఈ కారణంగానే తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. డిస్కం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. సర్వేలో బయటపడిన ఈ లోపాలను సరిదిద్దేందుకే రూ. 25 కోట్ల వ్యయం అవుతుండటం కొసమెరుపు.
-సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)
SPDCL | అత్యంత కీలకమైంది క్షేత్ర స్థాయిలోని విద్యుత్ నెట్వర్క్. అలాంటి నెట్‌వర్క్‌లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ యంత్రాంగానిదే. డిమాండుకు సరిపడా కరెంటు ఉన్నా… అంతరాయాలు మాత్రం నిత్యకృత్యంగా మారాయి. అయితే క్షేత్ర స్థాయిలోని నెట్ వర్క్ ప్రధానమని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నా.. అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక సబ్ స్టేషన్ నుంచి 11 కేవీ ఫీడర్ల ద్వారా ట్రాన్స్ఫార్మర్లు, అక్కడి నుంచి ఎల్ టీ లైన్ల ద్వారా ఇంటింటికీ సరఫరా జరిగే నెట్‌వర్క్‌లోనే చాలా లోపాలు ఉన్నాయని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చేపట్టిన 11 కేవీ ఫీడర్ సర్వేలోనే తేలింది.
సుమారు రెండు నెలల పాటు జరిగిన సర్వేలో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదకరంగా 12,598 స్తంభాలు ఉన్నాయని, అదేవిధంగా 1320 ట్రాన్స్ఫార్మర్లు కంచెలు లేకుండా ఉన్నట్లు గుర్తించారు. ఇవే కాకుండా స్తంభాలపై ఎలక్ట్రిక్ పరికరాలు కాలం చెల్లినా.. వాటిని మార్చకుండా అలాగే ఉంచడం గమనార్హం.
క్షేత్రస్థాయిలో ఏటా తరచూ చేపట్టాల్సిన చెట్ల కొమ్మల తొలగింపు విషయంలోనూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది. దీంతో గాలి, వానకు చాలా చోట్ల చెట్లు, వాటి కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో సరఫరాలో అంతరాయం తలెత్తుతున్నది. ఈ నేపథ్యంలో డిస్కం పరిధిలోని అన్ని సర్కిళ్ల పరిధిలో సమర్థవంతంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను నిర్వహించేందుకు ఇటీవల చేపట్టిన 11 కేవీ సర్వే ద్వారా లోపాలను గుర్తించి.. వాటిని సరిచేసే కార్యాచరణను సిద్ధం చేశారు.
డిస్కం పరిధిలోని 11 కేవీ ఫీడర్ సర్వేలో గుర్తించిన లోపాలను సరిచేసేందుకు సుమారు రూ.25.50 కోట్ల నిధులను కేటాయించారు. మరమ్మతు పనులు చేపట్టాలని క్షేత్ర స్థాయిలోని అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ నెట్‌వర్క్‌లో ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా సరఫరా ఉండేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. చేసే పనులు సైతం వీడియో, ఫొటోలు తీసి.. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన యాప్‌లో పొందుపర్చాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు.
విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు చేసే కాంట్రాక్టర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఉండేందుకు ఫొటోలను జీఐఎస్ కోఆర్డినేట్స్‌తో పాటు యాప్‌లో అప్డేట్ చేయాలన్న నిబంధనను పెట్టి, పారదర్శకంగా పనులు పూర్తి చేయిస్తున్నారు. సెక్షన్ స్థాయిలోని అధికారులు విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కొత్తగా రూపొందించిన యాప్‌లో లోపాలను వెంటనే నమోదు చేసే విధానాన్ని కచ్చితంగా అమలు చేయనున్నారు. దీనిద్వారా అంతరాయాలు తగ్గి.. నిరంతరం నాణ్యమైన సరఫరాకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.