సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : విద్యుత్ చరిత్ర, భద్రత, వినియోగం, భవిష్యత్ సాంకేతికతలపై సమగ్ర అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో హైదరాబాద్ నెక్లస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా టీజీఎస్పీడీసీఎల్ నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్ 2026 విశేషంగా ఆకట్టుకుంటోంది. సోమవారం వరకు జరగనున్న ఈ పవర్ ఎగ్జిబిషన్లో 120 ఏళ్ల హైదరాబాద్ విద్యుత్ ప్రస్థానం గురించి డిస్కం అధికారులు వివరిస్తున్న తీరు విద్యుత్‌పై అవగాహన కల్పించే దిశగా కొనసాగుతోంది. దక్షిణ డిస్కం మొదటిసారి నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో నిజాం కాలం నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ విద్యుత్‌శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేది ప్రజలకు తెలియచేశారు. ఆదివారం ఉదయం నుంచే సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శించి విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న మార్పులపై ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా చూస్తూ తమ సందేహాలను అధికారుల ద్వారా నివృత్తి చేసుకున్నారు.
ప్రత్యేకంగా విద్యార్థులు వివిధ స్టాళ్లలో విద్యుత్ ఉత్పత్తి నుంచి ఇళ్ల వరకు కరెంట్ ఎలా వస్తుందో తెలుసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్‌మీటర్లు, సబ్స్టేషన్లు, భద్రతా పరికరాలు, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలు, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గత వందేళ్లలో విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న మార్పులను ప్రజలకు వివరంగా తెలిపారు. విద్యుత్ వ్యవస్థ పనితీరు, దాని ప్రాముఖ్యతలను విద్యార్థులు, యువత ప్రత్యక్షంగా తెలుసుకునేలా ప్రత్యేక నమూనాలు, ప్రదర్శనలు ఈ ఎక్స్‌పోలో ఏర్పాటు చేయడంతో సందర్శకులు ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ స్టాళ్ల వద్ద తిరుగుతూ సందర్శకులతో మాట్లాడారు. విద్యార్థులను పలకరించి వారికి కరెంట్ వ్యవస్థను పరిచయం చేస్తూ వారితో సందడి చేశారు.

ఎస్పీడీసీఎల్ నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో దేనికదే ప్రత్యేకం కాగా విద్యుత్ మీటర్లు నాటి నుంచి నేటి వరకు ఎలా ఉన్నాయో చూపిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. విద్యుత్తు మీటర్లలో 1910 నుంచి 2026 వరకు ఎలా మారుతూ వచ్చాయో తెలిపేలా 50 రకాల మీటర్లను ప్రదర్శనలో ఉంచారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించిన వారికి గతంలో ఉపయోగించిన మీటర్లు, ప్రస్తుతం అమలులో ఉన్న డిజిటల్ మీటర్లు, భవిష్యత్తులో వినియోగంలోకి రానున్న స్మార్ట్ మీటర్ల గురించి అధికారులు స్పష్టంగా వివరించారు. ఇందులో కేడబ్ల్యూహెచ్ డిస్క్ మీటర్లను ప్రదర్శించారు. డిస్ప్లే వేర్వేరు మోడల్స్‌లో ఉండగా మొదట మెకానికల్ స్మార్ట్ మీటర్లు అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ మీటర్ల వరకు వచ్చాయి. అక్కడి నుంచి ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు వాడుతున్నారు. 1910, 1915, 1926, 1948 తదితర సంవత్సరాలలో ఉపయోగించిన విద్యుత్ మీటర్ల వివరాలను ఈప్రదర్శనలో సందర్శకులు ఆసక్తిగా చూస్తూ వివరాలు తెలుసుకున్నారు. మీటర్లు మారిన తీరు, స్మార్ట్ మీటర్ల వరకు మార్పులను అధికారులు వివరించారు.
విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఇళ్లల్లో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇళ్లలోని ఉపకరణాలు, ఈవీ చార్జింగ్ ఒకేసారి వినియోగిస్తే లోడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్‌ను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఇంటికి వచ్చే కరెంట్ వెనుక ఉన్న జనరేషన్ స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, ఈహెచ్‌టీ సబ్స్టేషన్లు, సబ్స్టేషన్లు, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టీ/హెచ్‌టీ లైన్లు, మీటర్ల వరకు పనిచేసే విధానంపై సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా మినియేచర్ నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. విద్యుత్ సరఫరాలో నెట్వర్క్ లోపాలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్న ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్లు, సెక్షనైజర్లు, నెట్వర్క్ మ్యాపింగ్, స్కాడా లేదా డీఎంఎస్ వరకు ఆధునిక విధానాలపై అధికారులు సందర్శకులకు అవగాహన కల్పించారు.
ఎక్స్‌పోలో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పవర్‌గేమ్స్ విభాగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యుత్‌కు సంబంధించిన సరదా ఆటలు, అవగాహన కార్యక్రమాలు, క్విజ్లు, బహుమతులు పిల్లలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్‌షో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి ప్రసార, పంపిణీ వ్యవస్థల ద్వారా వినియోగదారుల ఇళ్ల వరకు విద్యుత్ ఎలా చేరుతుందో విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన లేజర్ ప్రదర్శనతో అధికారులు వివరించారు. పవర్ ఎగ్జిబిషన్‌ను ఆల్ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ సెక్రటరీ రత్నాకర్ సందర్శించగా, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు శివాజీ, నరసింహులు, చక్రపాణి, కృష్ణారెడ్డిలతోపాటు సీఈలు, ఎస్ఈలు, జీఎంలు, ఏజీఎంలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతోపాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.