శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 27: ‘కంచ చేను మేసిన’ చందంగా.. కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు కొంతమందితో చేతులు కలిపి పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ రాజేశ్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జీఎంఆర్ ఎరీనాలో బిమార్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కాపర్ పవర్ కేబుల్ స్టోరేజీ ఉన్నది. స్టోరేజీలో ప్రధాన నిందితుడు అయిన బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని సిగ్నేచర్ వెంచర్ లో నివాసం ఉంటున్న అదిల శ్రీకాంత్ (28) స్టోరేజీ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
అతను ఉప్పుగూడ శివాజీనగర్ కు చెందిన కేతావత్ భాష(32), ముషీరాబాద్ బోలక్ పూర్ కు చెందిన అబ్దుల్ వాహిద్ (44) , బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ ఖాదర్ ఖాన్(40) , మహమ్మద్ హుస్సేన్, కుర్సీద్ హుస్సేన్, అలీ అనే ఏడుగురు తో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ స్టోరేజ్ కి సంబంధించిన నకిలీ తాళం చెవిని తయారు చేశాడు. ఈ ముఠా సభ్యులతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా తాళం తెరిచి కాపర్ పవర్ కంట్రోల్ కేబుల్ చోరీ చేశారు. అనంతరం దాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాలలోని పాత ఇనుప సామగ్రి దుకాణాల్లో అమ్మేశారు. అయితే స్టోరేజీలో నవంబర్ 17 నుంచి 27వ తేదీ మధ్య పవర్ కేబుల్ దొంగతనం జరిగిందని ఆ సంస్థ గుర్తించింది. అంతర్గత రహస్య విచారణ చేపట్టిన సంస్థ యాజమాన్యం సెక్యూరిటీ గార్డు శ్రీకాంత్ కొంతమందితో కలిసి దొంగతనం చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు.
ఈనెల 11వ తేదీన సంస్థ ప్రతినిధి అయిన పవన్ కుమార్ కడ్తాల్ శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులకు తమ సంస్థలో దొంగతనం జరిగిందని, దానికి సెక్యూరిటీ గార్డు శ్రీకాంత్ పైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా శ్రీకాంత్ తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అమ్మిన కేబుల్ విలువను వెలకట్టి రూ. 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నలుగురు నిందితులు శ్రీకాంత్, కేతావత్ భాష, అబ్దుల్ వహీద్, మహమ్మద్ ఖాదర్ ఖాన్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన రెండు వారాల్లోపే కేసు ఛేదించి రూ .20 లక్షల నగదు, సెల్ ఫోన్లు, బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ గతంలోనూ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. కేసు ఛేదించడంలో చురుకైన పాత్ర పోషించిన పోలీసులను ఆయన అభినందించి రివార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కె. రామ్ కుమార్ , కె. బాలరాజు డీఎస్ఐ హెచ్. కిషన్ జి తదితరులు పాల్గొన్నారు.