సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సంఘం అధికారులతో కలిసి పోస్టల్ శాఖ ఓటర్లకు సేవలందిస్తున్నది. ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీకి పోస్టల్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. అత్యంత పారదర్శకంగా పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ గత ఏడాది 3, 36, 747ల మందికి ఎపిక్కార్డులను అందజేశారు.
ఈ ఏడాది జనవరి 23 నుంచి నవంబరు 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 54,64,851ల మందికి ఎపిక్ కార్డులను పంపిణీ చేసినట్లు పోస్టల్‌శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 58,01,598 మందికి ఎపిక్ కార్డులను అందజేసినట్లు చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎపిక్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా పోస్టల్‌శాఖ సేవలపై రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్‌రాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు.