Anudeep Durishetty | సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ సమష్టిగా కలిసి పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పీఓ, ఏపీఓలకు ఇబ్రహీంబాగ్‌లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాల, మలక్‌పేట, ఉస్మానియా యూనివర్సిటీ కోఠిలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. శిక్షణకు ఎంత మంది హాజరయ్యారు? ఎంతమంది గైర్హాజరయ్యారు? శాఖల వారీగా గుర్తించి శిక్షణకు రానివారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏఆర్ఓ జ్యోతిని కలెక్టర్ ఆదేశించారు. గత ఎన్నికలలో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకుండా శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుదీప్ తెలిపారు.
భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల కోసం ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫారం 12 నింపి సంతకం చేసి ఇవ్వాలని సూచించారు. సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో టాయిలెట్, తాగునీరు, కరెంట్ తదితర సౌకర్యాలు ఉండేలా చూస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఆర్వోలు, పీఓలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.