సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎర్రగడ్డ ఆయుర్వేద దవాఖాన డైట్ కుంభకోణం తరహాలోనే నగరంలోని పలు ప్రభుత్వ దవాఖానల్లో యథేచ్ఛగా డైట్ కుంభకోణం కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు అధికారుల కక్కుర్తిని ఆసరాగా చేసుకొని కొందరు డైట్ కాంట్రాక్టర్లు రోగులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను గాలికి వదిలేసి క్వాలిటీలేని ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందించాల్సిన ఆహార పదార్థాలను తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యత లేని డైట్‌ను అందించడంతో పాటు ఇచ్చే దాంట్లో కూడా కోత విధిస్తున్నట్లు రోగుల సహాయకులు ఆరోపిస్తున్నారు.
భోజనంతో పాటు..
ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా కొనసాగుతున్న నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, ఎంఎన్‌జే, నిలోఫర్, ఉస్మానియా, పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖాన, సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖాన, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, టీబీ హాస్పిటల్స్‌తో పాటు గాంధీ దవాఖానలో ప్రతి రోజూ అనేక మంది రోగులు ఇన్పేషెంట్లుగా చేరుతుంటారు. దవాఖానలో చేరి, చికిత్స పొందే రోగులకు వారి ఆరోగ్యం, చికిత్స ఆధారంగా డైటిస్టు రోగులకు ఇవ్వాల్సిన డైట్‌ను సూచిస్తాడు.
దవాఖానలోని డైటిస్టు సూచన మేరకు డైట్ కాంట్రాక్టర్ రోగులకు మూడు పూటలా నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలి. ఉదయం అల్పహారం, మధ్యాహ్నం, రాత్రి సమయంలో భోజనం అందచేస్తారు. భోజనంతో పాటు పోషక విలువలను పెంచే గుడ్డు, పాలు, పండ్లు వంటి నాణ్యమైన డైట్‌ను కూడా అందజేయాలి. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి.
చాలా దవాఖానల్లో డైటిస్టులు కేవలంకు హాజరు వేసుకొని, నెలవారీ వాటా చూసుకుని మమ అనిపించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రోగుల డైట్‌ను పర్యవేక్షించాల్సిన ఆర్ఎంఓ స్థాయి అధికారులు డైట్ కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని రోగుల నోటికాడి బుక్కను కూడా వదలకుండా అందినకాడికి దండుకుంటున్నట్లు రోగులు, వారి సహాయకులు ఆరోపిస్తున్నారు.
ఇదీ రోగులకు అందించే డైట్ దుస్థితి..
నగరంలోని ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోని ఈఎన్టీ, ఉస్మానియా, నిలోఫర్, ఎంఎన్‌జే, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, మానసిక రోగుల దవాఖాన, పేట్లబుర్జ్, సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖానలు, ఫీవర్ హాస్పిటల్, గాంధీ దవాఖానల్లో రోగులకు అందించే డైట్ నాసిరకంగా ఉంటున్నదని రోగులు, వారి సహాయకులు ఆరోపిస్తున్నారు.
ఉదయం సమయంలో ఎక్కువగా ఉప్మాతోనే సరిపెడుతున్నారని, పాలు పూర్తిగా నీళ్ల మాదిరిగానే ఉంటున్నాయని, చాలా సార్లు గుడ్లు కుళ్లిపోయిన స్థితిలో దుర్వాసన వస్తాయని, ఇక అన్నం దొడ్డు దొడ్డుగా, కొన్ని కొన్ని సార్లు ఉడికీ ఉడకని స్థితిలో, పప్పు, సాంబారు వంటి చార్లు పూర్తిగా పలుచగా నీళ్లలో ఉప్పు, కారం వేసుకుని తిన్న మాదిరిగానే ఉంటుందని రోగులు ఆరోపిస్తున్నారు. అయితే తమకు అందుతున్న నాణ్యత లేని డైట్‌పై ఎవరికి చెప్పాలో తెలియక మిన్నుకుండి పోతున్నామని, సాధ్యమైనంత వరకు తమ కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటి నుంచే భోజనం తీసుకువస్తున్నట్లు రోగులు చెబుతున్నారు.
ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానలో జరిగిన డైట్ కుంభకోణం మరువకముందే ఇతర ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో బినామీ రోగుల పేర్లతో పెద్ద ఎత్తున డైట్ కుంభకోణం జరుగుతున్నా అడిగే నాథుడే కరువయ్యారు. ఆయా దవాఖానల్లో వెయ్యి మంది ఇన్‌పేషెంట్లు ఉంటే దానికి రెట్టింపు సంఖ్యలో రోగులకు డైట్ అందిస్తున్నట్లు రికార్డులో చూపించి కొందరు వైద్యాధికారులతో కలిసి డైట్ కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని నొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సూపరింటెండెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అధికారులు డైట్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బినామీ రోగుల బిల్లులకు సహకరించడమే కాకుండా నాసిరకం డైట్‌పై చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో అందిస్తున్న నాసిరకం డైట్‌పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పలు దవాఖానల్లోని కిచెన్ల తనిఖీలు చేశారు. గాంధీ, నిలోఫర్ తదితర దవాఖానల్లో తనిఖీలు జరిపిన ఆహార భద్రత అధికారులు ఇటీవల ఉస్మానియాలో తనిఖీలు జరిపి, డైట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో అందిస్తున్న నాణ్యత లేని డైట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నారు.