సిటీబ్యూరో, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్ లోపల చెరువుల హద్దుల నిర్ధారణకు హైడ్రా ఆయా చెరువుల సాంకేతిక అంశాల ఆధారంగా పనిచేస్తున్నది. ఇప్పటి వరకు ఔటర్ లోపల 1025 చెరువులను గుర్తించారు. అందులో పలు చెరువులకు సంబంధించి శాటిలైట్ చిత్రాలను, వివరాలను సేకరించే పనిలో పడింది. 1977 నుంచి 2024 నాటికి ఔటర్ లోపలి వైపున ఉన్న చెరువులకు సంబంధించి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ సర్వే విభాగం, రెవెన్యూ రికార్డుల్లోని వివరాలు, ఇరిగేషన్ విభాగం నుంచి సమాచారం, విలేజ్ మ్యాపుల ఆధారంగా చెరువుల విస్తీర్ణాన్ని నిర్ధారించి వాటి ఎఫ్టీఎల్, బఫర్జోన్లను నిర్ణయించనున్నది. ఇందుకోసం పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల్లో ముఖ్యంగా గొలుసుకట్టు చెరువులు దెబ్బతినకుండా ఉండటానికి వాటిని పునరుద్ధరించడానికి ఒక మోడల్ వ్యవస్థను రూపొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం 12 చెరువులను పునరుద్ధరించడానికి కావాల్సిన డీపీఆర్‌లను ప్రభుత్వానికి అందజేసినట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఈ చెరువులను పునరుద్ధరించి వాటిని మోడల్‌గా తీసుకొని వాటి తరహాలోనే మిగతా వాటిని కూడా తీర్చిదిద్దే లక్ష్యంతో పోతున్నామని వారు చెప్పారు. మరోవైపు చెరువుల పరిరక్షణ, జల, వాయు కాలుష్యంలేని చెరువులు ఉండాలనే లక్ష్యంతో చెరువుల్లోకి కాలుష్య కారకాలు చేరకుండా నియంత్రించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయా కంపెనీలపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి నాగాపూర్ సీఎస్ఐఆర్-నీరి డైరెక్టర్ డీఆర్ఏఎన్ వైద్య, నీరి హైదరాబాద్ జోనల్ చీఫ్ సైంటిస్ట్ షేక్ భాషాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల సమావేశమై చెరువులను కాలుష్య రహితంగా తీర్చిదిద్దే అంశాలపై చర్చించారు.
ఔటర్ లోపల గుర్తించిన 1025 చెరువులకు సంబంధించిన హద్దుల నిర్ధారణకు శాటిలైట్ మ్యాపులే కీలకమని తెలుస్తున్నది. చెరువుల అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దులు నిర్ణయిస్తున్నారు. చెరువు విస్తీర్ణాన్ని గుర్తించడంతోపాటు ఇందులో భాగంగా ఎన్ఆర్ఎస్సీతో ఒప్పందం కుదుర్చుకున్నామని హైడ్రా అధికారులు తెలిపారు. దీని ద్వారా 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా పారదర్శకంగా, శాస్త్రీయంగా మార్కింగ్ చేస్తామని వారు తెలిపారు. అయితే శాటిలైట్ చిత్రాలే కాకుండా సర్వే ఆఫ్ ఇండియా ట్రోపో షీట్లు, గ్రామ పటాలు, రెవెన్యూ రికార్డులు, ఇతరత్రా పత్రాల ఆధారంగా హద్దులు నిర్ణయిస్తారు. మరోవైపు శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ద్వారా తీసిన హై రెజుల్యేటెడ్ ఫొటోలను కూడా తీసుకునే దిశగా సంబంధించిత ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తున్నది. వీటి ఆధారంగా ఓఆర్ఆర్ లోపల 12 చెరువులను పునరుద్ధరించడంలో అక్కడి ఆక్రమణలపై హైడ్రా దృష్టిపెడుతున్నది. గుట్టల బేగంపేటలోని సున్నంచెరువు, బాచుపల్లిలోని ఎర్రకుంట, మాదాపూర్‌లోని తమ్మిడికుంట, చందానగర్ ఈర్లచెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, ఉప్పల్ నల్లచెరువు, అంబర్‌పేట బతుకమ్మకుంట, ఖాజాగూడలోని తౌతోని కుంట, రాజేంద్రనగర్‌లోని బుమ్రక్ దౌలా చెరువు, గగన్‌పహాడ్‌లోని అప్పాచెరువు, తార్నాక ఎర్రకుంట, దుండిగల్ కత్వ చెరువులపై డీపీఆర్‌లను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. స్థానికుల భాగస్వామ్యంతో ఈ చెరువులలో ఆక్రమణలను తొలగించడంతోపాటు మరికొన్ని చోట్ల ఆక్రమణలపై ఫిర్యాదులు తీసుకోవడానికి హైడ్రాగ్రీవెన్స్ నాటికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.